తిరుపతి: పుంగనూరులో రాజంపేట ఎంపీ, వైయస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై జరిగిన దాడిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా పార్టీ అభ్యర్థులతో కలిసి వెళ్లిన ఎంపీపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి వర్గాలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తిరుపతిలో భూమన అభినయ్రెడ్డిపై దాడి, రాయచోటిలో పార్టీ కార్యాలయానికి నిప్పంటించడం, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని గురుమూర్తి అన్నారు. ముందస్తు ఫిర్యాదులు చేసినప్పటికీ హింసాత్మక ఘటనలు జరగడం పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ఘటనలపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ కార్యకర్తలు, సామాన్య ప్రజల భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.