ఆర్టీసీ ఆస్తుల ధారాదత్తం దారుణం.. 

ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేసే కుట్రను ఖండిస్తున్నాం

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (ఎస్ఈసీ) కాలే పుల్లారావు

విజయవాడ: రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీ సంస్థను బలహీనపరుస్తూ, దాని విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం అత్యంత ఆందోళనకరమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (ఎస్ఈసీ) కాలే పుల్లారావు తీవ్రంగా ఖండించారు.

విజయవాడ విద్యాధరపురం డిపోను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించడం ఆర్టీసీ ప్రైవేటీకరణకు తొలి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో నిర్మితమైన ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.

ఈ-బస్సుల పేరుతో ఆర్టీసీ భూములు, డిపోలు, మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ ఎజెండా కనిపిస్తోందని కాలే పుల్లారావు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మికులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం వారి అభిప్రాయాలను పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు.

మొదటి దశలోనే సుమారు రూ.6 వేల కోట్ల విలువైన 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని డిపోలు, బస్ స్టేషన్లు కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆర్టీసీ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల ప్రయాణ అవసరాలకు ఆధారమైన సామాజిక బాధ్యత కలిగిన ప్రజా రవాణా వ్యవస్థ అని కాలే పుల్లారావు పేర్కొన్నారు. దానిని లాభనష్టాల కోణంలో కాకుండా ప్రజా సేవా దృక్పథంతో పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఆర్టీసీ ఆస్తుల ప్రైవేటీకరణ నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, నిపుణులతో చర్చించి ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున కాలే పుల్లారావు డిమాండ్ చేశారు. “ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రతి నిర్ణయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

Back to Top