భువనేశ్వరి, బ్రాహ్మణీల డేటా లీక్‌ చేస్తే ఊరుకుంటారా?

మీ కుటుంబీకులకు ఉన్న హక్కు ప్రజలకు ఉండదా బాబూ

ప్రాథమిక విచారణ కూడా లేకుండా ప్రభుత్వ తప్పు కాదని ఎలా చెబుతారు

టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదు చేయాలి

ప్రతిపక్షంపై కంప్లయింట్‌ చేయడం సిగ్గుచేటు

టీడీపీ వెబ్‌సైట్‌ మూతపడింది, త్వరలో పార్టీ కూడా..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: డేటా లీకేజీ కేసుతో తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ మూతపడిందని, సమగ్ర విచారణ జరిగితే పార్టీ కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా జరగకుండా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు విజయానంద్, అహ్మద్‌ బాబులు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లీకేజీ జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు బయటపెడితే మీరు ఊరుకుంటారా.. చంద్రబాబూ అని నిలదీశారు. మీ కుటుంబ సభ్యులకు ఉన్న హక్కే ప్రజలకు ఉండదా..? 3.5 కోట్ల ప్రజల సమాచారం గాల్లో పెట్టి ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ సీఈఓను తీసుకెళ్లి రక్షణ కల్పిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వాస్తవాలు బయటకు రాకుండా విచారణకు సహకరించకుండా ఎన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లోనే.. 

తెలుగుదేశం పార్టీ కుటుంబ వికాసం, సమాజ వికాసం కార్యక్రమం డిజైన్‌ బ్లూఫ్రాగ్‌ కంపెనీకి ఇచ్చారు. ఆ కార్యక్రమ డిజైన్‌ ఫైనల్‌చేయడానికి పంచాయతీ రాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ నుంచి జీఓ 75 విడుదలైంది. ప్రభుత్వం నుంచి 25 శాఖలను జీఓ ద్వారా జతపరిచారు. 25 శాఖలకు చెందిన అధికారులు బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీకి సంబంధించి డైరెక్ట్‌గా ఇన్వాల్స్‌ అయి ఉన్నట్లు జీవోలో ఉంది. ఐటీ గ్రిడ్స్‌కు బ్లూఫ్రాగ్‌ నుంచి సమాచారం అందిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీ సేవామిత్ర యాప్‌ను తయారు చేసి నిర్వహిస్తుంది. బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ సంబంధాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వమే 25 శాఖలను ఇన్వాల్స్‌ కావాలని చెప్పినప్పుడు ప్రభుత్వ సమాచారం బయటకు రాలేదని అధికారులు ఎలా చెప్పగలుగుతున్నారు. విచారణ ఏమైనా చేయించారా..? విజయానంద్‌ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా మాట్లాడుతున్నారా.. లేక టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సచివాలయంలో ఎవరిని అడిగినా చెబుతారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోలీసు కంప్లయిట్‌ ఇస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీ ప్రజల సమాచారం ఆధార్, బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు, కులం వివరాలు ప్రైవేట్‌ కంపెనీ చేతుల్లోకి వెళ్లిందనే వివాదం నడుస్తోంది. మీరు విచారణ జరిపి ప్రభుత్వం నుంచి తప్పిదం లేదని ఫిర్యాదు చేయాలి. వైయస్‌ఆర్‌ సీపీపై, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు తగదాలా ఫిర్యాదు చేసే దీనస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. మీ చెప్పుచేతల్లో ఉన్న ఏపీ పోలీసుల నుంచి గుడ్‌ గవర్నెన్స్‌ అనే చిన్న సర్టిఫికెట్‌ కూడా తెచ్చుకోలేరని అర్థం అవుతుంది. ఫారమ్‌– 7 ఇచ్చిన వారిపై తిరగబడండి అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా.. అని అనుమానం కలుగుతోంది. ఫారమ్‌ – 7 ఈసీ పౌరులకు ఇచ్చిన హక్కు. ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నాడు. 

ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ద్వారా మొత్తం గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకెళ్తుందని ఫిబ్రవరి 21వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కంప్లయింట్‌ ఇచ్చారు. చలానా కూడా చూపిస్తాం. 

టీడీపీ నేతలు మార్చి 2న ఫిర్యాదు చేశారు. కానీ 23వ తేదీనే ఐటీ గ్రిడ్స్‌పై సోదాలు చేశారని మాట్లాడుతున్నారు. ప్రజల సమాచారాన్ని రోడ్డు మీద పెట్టిన చంద్రబాబు తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ కంపెనీల యాజమాన్యం, సీఈఓలు అనేక సార్లు సీఎం హెలికాప్టర్, విమానాల్లో ప్రయాణించలేదా..? నామినేషన్ల ప్రక్రియలో కోట్ల రూపాయల పనులు ఈ కంపెనీలకు అప్పగించారు. సొంత కంపెనీలను పెట్టుకొని చంద్రబాబు, లోకేష్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల తీర్పును కూడా మేమే డిసైడ్‌ చేస్తామని చంద్రబాబు పొలిటికల్‌ మాఫియాగా అవతరిస్తే విచారణ జరగకూడదా..?

సీబీఐకి అప్పగిస్తే కాలయాపన చేయవచ్చు ఎన్నికల గండం తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేస్తున్నారా.. ? సీబీఐ అంటే మీకొక పడని పాములా చూపించారు కదా.. మళ్లీ ఎందుకు సీబీఐ అంటున్నారు. ఇది అశోక్‌ బాబు స్టాండా.. టీడీపీ స్టాండా..? సీబీఐ ఎంక్వైరీ ఎప్పుడు జరిపిస్తారు..? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై కనీస విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారంటే ఎంతకు తెగించారో ప్రజలంతా చూస్తున్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు చేయడం. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ ఎందుకు మూతపడింది. వెబ్‌సైట్‌ కూడా మూతపడింది. రేపు పార్టీ కూడా మూతపడుతుంది. 

Back to Top