చిలకలూరిపేట : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ఆమె, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే బ్రహ్మనాయుడు గారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి వ్యక్తో పల్నాడు ప్రాంత ప్రజలందరికీ బాగా తెలుసని, ఆయన ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడని తెలిపారు. వినుకొండ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిని ఈరోజు నిందితుడిగా చూపించడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న బ్రహ్మనాయుడు గారినే నిందితుడిగా చేర్చడం అన్యాయమని రజిని విమర్శించారు. ఫేక్ జీవోలు, వాటికి సంబంధించిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారిలో బ్రహ్మనాయుడు అనుచరులు కూడా ఉన్నారని, నిజాలను బయటపెట్టిన వారిపైనే కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. బ్రహ్మనాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు గారిపై నమోదు చేసిన కేసులను నిష్పాక్షికంగా విచారించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు.