డీఎస్సీ మెగా స్కామ్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలి

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జి ఆలూరు సాంబశివారెడ్డి 

తాడేపల్లి:  కూట‌మి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, బాధిత నిరుద్యోగులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జి ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలపై యూత్‌, స్టూడెంట్‌ వింగ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు, జోనల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ, మండల అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమై పరీక్షలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అర్హత కలిగిన పలువురు అభ్యర్థులు నష్టపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాల్లో భాగంగా రేపు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే టౌన్‌హాల్‌ ఇండోర్‌ సమావేశాల్లో డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు ప్రధాన చర్చాంశంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు డీఎస్సీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి, చివరకు మూడు లక్షల మందికి పైగా నిరుద్యోగులను మోసం చేసిన వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. డీఎస్సీ నియామకాలలో అర్హతలపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఆడియో రికార్డులు బయటకు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం, న్యాయం కోసం వైయస్ జగన్‌ను కలిసిన బాధిత అభ్యర్థులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడటం మరింత ఆందోళనకరమని అన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మంత్రి గానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని, మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్ జరిగిందనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని అన్నారు. నిజాలు వెలుగులోకి వచ్చేంత వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి అంశాలను కూడా సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించారు. యువత, విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

డీఎస్సీ బాధితులకు భరోసా కల్పించడం ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్న ఆలూరు సాంబశివారెడ్డి, రేపు, ఎల్లుండి జరిగే అన్ని సమావేశాల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగేలా చూడాలని, నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

 

Back to Top