వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే పేరుతో కార్యక్రమం నిర్వహించింది, కానీ దాని వల్ల విద్యార్ధులకు ప్రయోజనం శూన్యమన్నారు. ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి, విద్యావ్యవస్ధకు మీరు ఏం చేశారు, విద్యార్ధులకు ఏ సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏం లేక, కేవలం ప్రచారానికే ఈ హడావిడి కార్యక్రమం చేపట్టారని ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరునెలల్లో మేం ఇది చేశామని చెప్పుకోవడానికి ఏం ఉంది, తల్లిదండ్రులకు, విద్యార్ధులకు మీరేం చేశారు, ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు తప్ప చేసిందేం లేదు, మీరు విద్యావ్యవస్ధలో తొలగించిన వాటి గురించి ప్రశ్నించకుండా ఎంపిక చేసుకున్న కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడించారు. కూటమి ప్రభుత్వం విజన్ ఏంటో చెప్పి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం తొలగింపు, టోఫెల్ తొలగింపు, డిజిటల్ బ్లాక్ బోర్డ్స్, నాడు నేడు కింద స్కూల్స్ మార్పు, సీబీఎస్‌ఈ తొలగింపు, ఐబీ తొలగింపు ఇవన్నీ తీసేశాం అని చెప్పి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి, కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు మీ పాలనపై, మీ విద్యావిధానంపై నిలదీస్తే మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు పవన్‌కళ్యాణ్ కడప వచ్చి చేసిందేంటి, మీరు విద్యార్ధుల భవిష్యత్‌ను చీకటి మయం చేశారు, జగన్ గారు అక్షరాస్యతను పెంచితే మీ కూటమి ప్రభుత్వం నిరక్షరాస్యతను ప్రోత్సహించింది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు, పిల్లలను బడికి కాకుండా కూలీ పనులకు పంపుతున్నారు, పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వంగా మీరేం చేస్తారో చెప్పలేకపోయారు, మీరు ఏ సంస్కరణలు తీసుకొచ్చారో చెప్పలేకపోయారు నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా, మీరు వేల పాఠశాలల్లో కార్యక్రమం చేశారు కానీ ఒక్క చోటైనా కారణం చెప్పగలిగారా, నాడు నేడు కింద జగన్ గారు చేసిన గుర్తులు, జ్క్షాపకాలు కనిపించాయి, జగన్ గారు చేసిన అభివృద్ది ప్రతీ చోటా కనిపిస్తుంది, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఏ స్కూల్ కైనా ప్రభుత్వ గ్రాంట్ లక్ష రూపాయలు ఇచ్చారా, కానీ జగన్ గారి హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. వంద కోట్లు మా నియోజకవర్గంలోని స్కూల్స్‌కు ఇచ్చాం, జగన్ గారి మీద అక్కసుతో విద్యార్ధుల భవిష్యత్ నాశనం చేస్తున్నారు, మీరు చేస్తున్న తప్పులు ప్రజలు మరిచిపోరు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు, పిల్లలకు ఓట్లు లేవని ఇలా చేస్తారా, పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వకపోగా వారి తండ్రులకు మాత్రం నాణ్యమైన మద్యం ఇస్తున్నారు, వారి తల్లులకు మాత్రం ఆకర్షణీయమైన పధకాలు పెడతామని మభ్యపెట్టారు దేశంలో ఏ పార్టీ ఆరునెలల్లో ఇంత దారుణంగా వైఫల్యం చెందిన దాఖలాలు లేవు, మీరు ప్రజల హృదయాల్లో జగన్ గారిపై విషం చిమ్మడం, సొంత డబ్బా కొట్టుకోవడమే మీ ఎజెండా, పవన్ మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు, మీ రాజకీయ భవిష్యత్ మాత్రమే మీకు ముఖ్యమా, జగన్ గారి హయాంలో విద్యా విధానం స్వర్ణయుగం, చదువే పిల్లలకు ఇచ్చే ఆస్తి అని ఆయన ముందుకెళ్ళారు, గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి చెప్పింది చెప్పినట్లు అమలు చేశారు, చంద్రబాబు మాత్రం విద్యావ్యవస్ధను నాశనం చేశారు, ఇదంతా చీకటి రోజులే, బ్లాక్ డేస్, కూటమి ప్రభుత్వం ఇకనైనా విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడవద్దు, యూనివర్శిటీలలో వీసీల నియామకం కూడా పెండింగ్‌లో పెట్టారు, ప్రజలు ఒకసారి ఆలోచించండి అని కోరుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్ నాశనమవుతోంది, మీ బిడ్డల భవిష్యత్ కోసం వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది, మీ మద్దతు ఇవ్వండి మేం మీ తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.