తాడేపల్లి: పరిపాలనా వికేంద్రీకరణ చాలా బాగుందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుతో అనుకున్న దాని కంటే ఎక్కువ పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చాలా బావుందని.. మిడిల్ లెవల్ అడ్మినిస్ట్రేషన్ సమూలంగా సంస్కరించబడిందన్నారు. వికేంద్రీకరణ ఫలాలు కూడా వచ్చే ఐదారు నెలల్లో వస్తాయన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలా ఇది కూడా విజయవంతమవుతుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని కొలమానంగా తీసుకోవడం వల్ల సమస్యలు లేవన్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేయడం వల్లే జిల్లాల పునర్విభజన సజావుగా జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌పై కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారని, 7న కేబినెట్‌లో పెట్టి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని సజ్జల తెలిపారు.