వీణ్ని అంతం చేస్తే వైయ‌స్ఆర్‌సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!

వైయ‌స్ఆర్‌సీపీ దళిత నేత, అతని భార్యపై టీడీపీ మూకల దాష్టీకం  

డీసీఎంఎస్‌ అధ్యక్షుడి ప్రోద్భలంతోనే దాడులు

తిరుప‌తి: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుండగా.. వారికి వంత పాడుతున్న పోలీసుల అచేతనానికి రాష్ట్రం సిగ్గుపడాల్సి వస్తోంది. మహిళా సర్పంచ్‌ కుటుంబంపై మంగళవారం టీడీపీ మూకలు దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. 11నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చించి, పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్లతో తొక్కి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత మండలం తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది.  

వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండల వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్‌ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడి అనుచరులు వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్‌ ఇంట్లో ఉండగా.. సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేశ్, వామనమూర్తి, గురవయ్య, కిషోర్, చక్రవర్తి, నాగేష్, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకు వెళ్లారు. 

‘వీడు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అజయ్‌ తల్లిదండ్రులు, చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి కళ్లలో కారం కొట్టి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. 

మహిళ బట్టలు చించి.. గుండెలపై తొక్కి.! 
తన భర్త అజయ్‌పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చారు. దాడిని అడ్డుకొని వారిని ప్రశ్నించగా.. టీడీపీ గూండాలు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటి బిడ్డతో సహా ఆమెను కింద పడేసి, గుండెలపై కాళ్లతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుంటే తమను చంపేసి ఉండేవారంటూ ఆ దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 

పథకం ప్రకారమే దాడి.. 
డీఎసీఎంఎస్‌ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆదేశాలతో పక్కా పథకం ప్రకారమే తమపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు అజయ్‌ వాపోయారు. ఏడాదిన్నరగా విడతల వారీగా వైయ‌స్ఆర్‌సీపీశ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మోహిత్‌ రెడ్డి చొరవతో మాతమ్మ ఆలయాన్ని నిర్మించామని, ఏడాదిన్నరగా ఆలయంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గత మూడు రోజులుగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. దాడిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం టవర్‌క్లాక్‌ సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనపై బాధితుడితో పాటు అతని భార్యను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులపై దాష్టికాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 

Back to Top