తాడేపల్లి: మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అన్నదాతలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం, మా వల్లే తుపాన్ ఆగిపోయిందంటూ సిగ్గు లేకండా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పంట నష్టపోయి రోజులు గడుస్తున్నా ఇంకా అంచనాలు వేయక పోవడంతో పాటు, కనీసం రైతులకు ఇచ్చే పరిహారం పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు అందించే సాయంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్టపోయిన రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరోవైపు తుపాన్ ను ఆపేశామంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. దీనికి తోడు పంట నష్టం అంచనాల్లో కూడా ప్రభుత్వం రైతులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. పంట నష్టపోయిన రైతులు పరిహారం తీసుకుంటే... వారి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసేది లేదని బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాన్ని తొలిసారిగా చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు రైతులు తమ పరిస్ధితి ఆగమ్య గోచరంగా తయారైందని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంట నష్టాన్ని ఒక్క రోజులో ఎలా అంచనా వేస్తారు? ఇదెలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రైతులను కార్యాలయాలకు పిలిపించుకుని.. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని వాళ్లకు చెప్పడం ద్వారా.. రైతులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇది అత్యంత దుర్మార్గం. వైయస్.జగన్ ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా ఉండేవారు. ఏ విపత్తు వచ్చినా ఆదుకునేందుకు జగన్ ఉన్నాడనే ధైర్యం వారికి ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం ధాన్యం పండించడం అనవసరమని మాట్లాడుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాన్ వల్ల రైతులు చాలా నష్టపోయారు. పంట నేలకూలడంతో రైతులకు మరింత అదనంగా ఖర్చు పెరగనుంది. ధాన్యం పాలుపోసుకునే సమయంలో తుపాను రావడంతో గణనీయంగా దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● కౌలు రైతులనూ గాలికొదిలేసిన కూటమి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇ-క్రాప్ నిలిపివేసింది. దాంతో రైతులు ఎంత పంట పండించారో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనం. వైయస్.జగన్ హయాంలో ఉచిత పంటల బీమా ఉండేది. ఈ ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. దురదృష్టవశాత్తూ వరి పండించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం దారుణం. రైతులను అక్కున చేర్చుకుని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైతులను నిరుత్సాహ పరుస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. వారికి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అందలేదు. వారికి కౌలు కార్డులు కూడా ఇవ్వలేదు. వారికి యూరియా కూడా ఇవ్వలేదు.. దీంతో వాళ్లందరూ బ్లాక్ లో యూరియా కొనుక్కున్నారు. పులిమీద పుట్రలా వారిని తుపాన్ తీవ్రంగా నష్టపరిచింది. ఏ రైతు అయినా తన పొలంలో 33 శాతం పంట నష్టపోతే వారికి నిబంధల ప్రకారం పరిహారం చెల్లించాలి. అయితే పరిహారం తీసుకుంటే వారి నుంచి ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్పడం దారుణం. ధాన్యం తడిసినా, రంగు మారినా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తుపాన్ వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా నేటికీ సీఎం చంద్రబాబు పంట నష్టపరిహారం ఇంత ఇస్తామని కనీసం ప్రకటన చేయకపోవడం దారుణం. అసలు పంట నష్టం వివరాలు కూడా ప్రకటించలేదంటే.. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది. తుపాన్ వల్ల కేవలం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పంట నాటుకున్నప్పటి నుంచీ నేటి వరకూ ఏ దశలోనూ అన్నదాతలను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ రద్దుతో రైతులు మరింత నష్టపోయారు. ఈ నేపధ్యంలో తక్షణమే ప్రభుత్వం తుపాన్ ప్రభావంతో ఎంత పంట నష్టం జరిగింది ? ఏ మేరకు పరిహారం ఇస్తున్నారో తక్షణమే ప్రకటించాలి. 4.75 లక్షల ఎకరాల్లో ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు ఎలా పరిహారం పొందాలో వారికి తెలియజేయాలి. పంట నష్టపోయిన రైతుల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్ ప్లే చేయడంతో పాటు అభ్యంతరాలను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా పరీవాహక ప్రాంత లంక భూముల్లో వాణిజ్య పంటలు మునిగిపోతే... ఇంతవరకు ఆ వివరాలు కూడా నమోదు చేసే పరిస్థితి లేదు. రైతుల పట్ల మీకున్న వివక్షతకు ఇదే నిదర్శనం. పసుపు, బొప్పాయి, కంద రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ర ప్రజలందరూ ప్రభుత్వ తీరును గమనిస్తున్నారు. మరోవైపు వైయస్.జగన్ ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. ఏరోజు కూడా రైతుల కులం, మతం, పార్టీ చూసిన సందర్భం లేదు. నష్టపోయిన ప్రతి రైతుకి సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రం రైతులకు పార్టీలను అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణం. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాక్కాకుండా పంట నష్టం అంచనాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఇదే ధోరణి కొనసాగిస్తే రైతులు మిమ్నల్ని రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా చేయడం ఖాయం. రైతులు మునుపెన్నడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులకు ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు రబీ సీజన్ కు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయాన్ని అందించాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించడానికి వైయస్.జగన్ వస్తున్నప్పుడు... ఆయనను చూడ్డానికి వచ్చిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఆంక్షలు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై నేను సీఐని ప్రశ్నిస్తే... నాపై అనుచితంగా మాట్లాడుతూ నన్ను తిరిగి దుర్భాషలాడారు. నా మీద కేసు పెట్టారు. పోలీసులంటే మాకు గౌరవం ఉంది. కానీ అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. దీనిపై మాట్లాడటానికి నేను ఎస్పీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా మీద కేసులు పెట్టడం కాదు, గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులకు అడ్డుకట్ట వేయడంతోపాటు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకోవాలని కైలే అనిల్ కుమార్ సూచించారు.