పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలం నులకజోడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామమందిర ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కళావతమ్మ కృషితో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సుమారు రూ.10 లక్షల నిధులు మంజూరై ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే విధంగా ఆలయాన్ని నిర్మించడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళావతమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన కళావతమ్మకు నులకజోడు గ్రామ ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భామిని మండల పార్టీ నాయకులు, నులకజోడు గ్రామ సర్పంచ్ కొత్తూరు ప్రసాదరావు, ఉప సర్పంచ్ కొన్న తిరుమలరావు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.