ఎల్లో మీడియా 'కట్టుకథల' ఆధారంగా అధికారులపై కక్షసాధింపా?

అభద్రతాభావంలో చంద్రబాబు అరాచక పాలన

తీవ్రంగా  మండిపడ్డ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 

తాడేపల్లి లోని  వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార 
ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

పచ్చ పత్రికల కథనాలే బదిలీలకు ప్రామాణికమా?

బ్యూరోక్రసీపై కూటమి ప్రభుత్వం బరితెగింపు 

అధికారులను బలిపశువులను చేస్తున్న బాబు సర్కార్

రాముడు లేని రాజ్యంలో కోతుల పెత్తనంలా కూటమి పాలన 

అభద్రతాభావంతో అల్లాడుతున్న చంద్రబాబు

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.

జవహర్ రెడ్డి వెళ్లని చోట మీటింగ్ ఎలా జరిగింది?

ఇది చంద్రబాబు భయానికి పరాకాష్ట

అధికారులనూ వదలి కక్షా రాజకీయం 

ఐఏఎస్, ఐపీఎస్ లపై వేధింపులు ఆపాలి

వైయస్.జగన్ హయాంలో అధికారులకు గౌరవం

బాబు హయాంలో బదిలీల వేటు

వ్యవస్థలను ఖూనీ చేస్తున్న చంద్రబాబు.

గడప గడపకీ రేషన్ డోర్ డెలివరీ అందించిన వైయస్.జగన్

ప్రతి గడపకీ కక్ష రాజకీయం పరిచయం చేసిన చంద్రబాబు 

ధ్వజమెత్తిన తాటిపర్తి చంద్రశేఖర్ 

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

- బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..

వైయస్.జగన్ హయాంలో రాష్ట్రం లోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు.  మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది. 

- జరగని మీటింగ్ పై బాబు ఉలికిపాటు..

రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు? అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెల్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పి ఎస్ ఆర్ ఆంజనేయలు, పీ వీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి? గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం?  

- వైయస్.జగన్ హయాంలో హుందాతనం..

వైయస్.జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్ధం అవుతోంది. గతంలో తన పాలనలో  అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ  చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి. అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే. 

- బాబు పాలనలో కక్ష సాధింపులు..

ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే. 

పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే...  నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top