రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు

నన్ను, నా అనుచరులను లక్ష్యంగా చేసుకుంటూ తప్పుడు  కేసులు

పల్నాడు జిల్లా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడదల రజిని

నాపై నమోదైన తప్పుడు కేసులకు తలొగ్గేది లేదు

చట్టపరంగా పోరాటం చేస్తాను

జాతీయ మానవ హక్కుల కమిషన్ కూ ఫిర్యాదు

స్పష్టం చేసిన విడదల రజిని

చిలకలూరిపేటలో యధేచ్చగా రేషన్ మాఫియా, గ్రావెల్ దందా

నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు

అయినా పట్టని పోలీసులు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై మాత్రం అక్రమ కేసులు

వీటన్నింటిపై పారదర్శకంగా విచారణ జరిపించండి

జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసిన విడదల రజిని

న‌రసరావుపేట:  రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తనపైనా, తన అనుచరులపైనా సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఇరికించి కొంతమంది పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అక్రమాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే.. వారు నా అనుచరులంటూ నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో యధేచ్చగా రేషన్ మాఫియా, గ్రావెల్ దందా, పేకాట క్లబ్బులు నడుస్తుంటే పట్టని పోలీసులు.. వీటిపై పోరాటం చేస్తున్న మాపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.  వీటిపై  పారదర్శకంగా విచారణ జరిపించాలని పల్నాడు జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన విడదల రజని.. తప్పుడు కేసులు నమోదు చేసిన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
  
● తప్పుడు ఫిర్యాదులు- అక్రమ కేసులు..

వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు పోలీసులు, చట్టం, వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది. కానీ కొంతమంది పోలీసులు టార్గెట్ విడదల రజిని అంటూ హైడ్రామా నడిపిస్తున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాలనుకున్న వారికి ఆజ్యం పోస్తున్నారు. గాలిపోగేసుకుని, కట్టుకథలల్లి నన్ను లక్ష్యంగా చేసుకుని నా సిబ్బందిని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఫిర్యాదు చేశారు. వాటి వెనుక కొంతమంది పోలీసుల పాత్ర  కూడా ఉందేమోనన్న అనుమానం నాకు కలుగుతుంది. శ్రీగణేష్ చౌదరి నా సన్నిహితుడని, అతనికి మాకు ఏవో  లావాదేవీలున్నాయని ఫిర్యాదు చేస్తే.. ఆగమేఘాల మీద నా సిబ్బంది మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. 

● నిందితుడు శ్రీగణేష్ చౌదరి టీడీపీ మనిషే...

ఎవరీ శ్రీగణేష్ చౌదరి అని ఆరాతీస్తే... ఇతను 2024 ఎన్నికల్లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రచారంలో ఉన్నాడు. వారి కోసం ప్రచారం కూడా చేశాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. ఇతన్ని నా అనుచరుడు అంటూ కట్టుకథ అల్లి నా మీద కేసు పెట్టారు. 
 ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. చిలకలూరిపేటకు చెందిన బత్తుల శ్రీగణేష్ రూ.35 లక్షలు తీసుకున్నారు, మాకు న్యాయం చేయండని  మార్చి 1, 2025లో సుబానీ అనే వ్యక్తి ప్రజావేదికలో మంత్రి లోకేష్ కి అర్జీ పెట్టుకున్నారు. బత్తుల శ్రీగణేష్ అనే వ్యక్తి తాను పత్తిపాటి పుల్లాలావు అనుచరుడని అని చెప్పుకుంటూ.. నా కుమార్తెకు గుంటూరు విజ్ఞాన్ లో సీటు ఇప్పిస్తానని పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని మా దగ్గర  రూ.35 లక్షలు తీసుకుని పదేళ్లు అయింది. అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మార్చి నెలలో సుబానీ మరలా... మంత్రి లోకేష్ కి ఫిర్యాదు చేశాడు. మాకు సంబంధం లేని వ్యక్తి, మా పార్టీ కాని వ్యక్తి మీద ఎవరో కేసుపెడితే.. దానికి నాకూ సంబంధం లేకపోయినా కట్టుకథ అల్లి మా మీద కేసు నమోదు చేస్తారా ?

వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో జనవరి 1, 2025లో రాజీ ఒప్పంద పత్రం రాసుకున్నారు. టౌన్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ చూస్తే... మా మీద ఫిర్యాదు చేసిన మాబు సుభాని అనే వ్యక్తికి, బత్తుల శ్రీగణేష్ రూ.6 లక్షలు చెల్లించేలా ఒప్పందం పత్రాలు రాసుకున్నారు. ఇక్కడ కూడా మా పేరు లేదు. ఫిర్యాదు చేసిన మాబూ సుభాని చిలకలూరిపేట టీడీపీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావన కూడా లేదు. నన్ను నా సిబ్బందిని టార్గెట్ చేసి మా వ్యక్తిత్వాన్ని హననం చేసే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరిపేటలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై నిలబడి పోరాటం చేస్తుంటే.. దాన్ని తట్టుకోలేక మా పై తప్పుడు కేసుల నమోదుకు ప్రయత్నిస్తున్నారు.

● యూనిఫామ్ వదిలి ఖద్దరు ధరిస్తున్న కొంతమంది కాకీలు...
 
ఇక డియస్పీ హనుమంతరావు అయితే పోలీస్ చొక్కా వదిలిపెట్టి.. ఖద్దరు చొక్కా ధరించినట్లున్నాడు. సంబంధంలేని కేసులో... గాలిపోగేసి ఎవరో ఫిర్యాదు చేస్తే మాపై కేసులు పెడతారా? ప్రమోషన్లు, పోస్టులు, బాస్ ల మెప్పుల కోసం... చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మీతో పాటు మిమ్మల్ని ఆడిస్తున్న వాళ్లను వదిలిపెట్టేది లేదు? జిల్లా పోలీసుల యూనిఫామ్ లో మూడు సింహాలు ఉంటాయి.. వీరు మాత్రం మూడు రకాల కండువాలు వేసుకున్న వారికి ఊడిగం చేస్తున్నారు. మీరు చేస్తున్న చట్ట వ్యతిరేక పనులు మీద న్యాయపోరాటం చేస్తాను. మాకు సంబంధం లేని వ్యవహారంలో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్న మీ తీరు పై పరువునష్టం కేసుతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయిస్తాను. చిలకలూరిపేట నియోజకవర్గంలో చట్టాన్ని అతిక్రమిస్తూ, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొంత మంది పోలీసులుపై కచ్చితంగా నా పోరాటం కొనసాగుతుంది.

చిలకలూరిపేట నియోజకవర్గంలో యధేచ్చగా రేషన్ మాఫియా నడుస్తోంది. దానిపై ఈ పోలీసులు ఏం చేశారు. పేకాట శిబిరాలు, క్లబ్బులు పెరిగి పోతున్నాయి. వాటిపైనా ధ్యాస లేదు. గ్రావెల్ మాఫియా నడుస్తోంది.. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఇవేవీ పోలీసులకు కనిపించడం లేదు. కేవలం నన్ను, నా అనుచరులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులతో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారు. మీరు వేసిన ఈ చెడు సంప్రదాయం మిమ్నల్ని దహించడం ఖాయమన్నారు. మీరు చేస్తున్న తప్పులకు తగిన గుణపాఠం నేర్పించి.. చట్టం ముందు కచ్చితంగా నిలబెడతానని విడదల రజిని స్పష్టం చేశారు.

Back to Top