అనంతపురం : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 12న ‘వైయస్ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ర్యాలీలు విజయవంతం చేయాలని కోరుతూ శనివారం అనంతపురం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..`రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైద్యరంగలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు పేద విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి 7 కళాశాలలు పూర్తి చేశారు. ఐదింట్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. 10 మెడికల్ కళాశాలల నిర్మాణాలు 30 శాతం నుంచి 70 శాతం వరకు పూర్తి చేశాం. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబుకు పట్టడం లేదు. తన అనుచరులకు కళాశాలలను అప్పగించాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం ఉండడం లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ఈనెల 12వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తాం. అనంతపురంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్‌మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి` అని అనంత వెంకట్రామిరెడ్డి కోరారు.