నరసరావుపేట: ప్రభుత్వ మెడికల్ కాలేజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. వైయస్.జగన్ హాయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పాడేరు కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభం కాగా, ఎన్ ఎమ్ సీ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఏడాది మంజూరైన 50 సీట్లు రద్దవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యను, ప్రజలకు వైద్యాన్ని అందకుండా చేసిన చేతకాని ఆరోగ్యశాఖ మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● ప్రభుత్వ నిర్లక్ష్యంతో 50 మెడికల్ సీట్లు రద్దు... పాడేరులో వైయస్.జగన్ హాయంలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభమైంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన 50 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉంటాయి.ఈ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహణ వంటి అంశాలన్నీ పర్యవేక్షిస్తుంది. ఈ యూనివర్సిటీకి ఏ విధంగా అఫిలియేషన్ ఇచ్చారో చెప్పాలని ఎన్ ఎమ్ సీ ఒక చిన్న వివరణ అడిగింది. ఈ ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వలేక పోవడంతో కొత్తగా 50 సీట్లు ఇవ్వడం లేదని ఎన్ ఎమ్ సీ ప్రకటించింది. కనీసం ఒక చిన్న సమాచారం ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాడేరు మెడికల్ కాలేజీ ఇవాళ 50 మెడికల్ సీట్లు కోల్పోయింది. ఇది మెడికల్ విద్య అభ్యసించాలన్న పేద విద్యార్ధులకు తీరని నష్టం. ప్రజలందరూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గమనించాలి. పులివెందులలో కూడా పూర్తిగా మెడికల్ కాలేజీ నిర్మాణం 100 శాతం పూర్తైతే.... మాకు మెడికల్ సీట్లు వద్దు అని రాసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. చివరకు మెడికల్ కాలేజీలో ఉన్న అత్యంత విలువైన పరికరాలను కూడా ఇతర మెడికల్ కాలేజీలకు తరలిస్తూ... ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సమ్మిట్ ల పేరుతో ఛార్టెడ్ ప్లైట్లకు, ప్రచారానికి వందలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ దుర్వినియోగం చేస్తున్న కూటమి ప్రభుత్వం.... ఒక కొత్త మెడికల్ కాలేజీకి కావాల్సిన పరికరాలు కొనలేని దుస్ధితిలో ... వైయస్.జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలోని పరికరాలను తరలిస్తోంది. 100 శాతం భవనాలు పూర్తై, అన్ని పరికరాలతో మెడికల్ కాలేజీ సిద్ధంగా ఉంటే మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ● ఆరోగ్యశాఖ మంత్రిని తక్షణమే తొలగించాలి... ఆరోగ్యశాఖ మంత్రి నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం. పీహెచ్ సీ డాక్టర్లు వెళ్తే వారిని మోసం చేసేకార్యక్రమం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కి నిధులివ్వక ... ప్రైవేటు ఆసుపత్రులు ఆందోళనకు దిగడంతో దాదాపుగా 20 రోజులకు పైగా రోజులు ఇబ్బంది పడుతున్నా ఇంతవరకు గతంలో ఇచ్చిన రూ.250 కోట్లు తప్ప ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అక్టోబరు నెలాఖరుకి డబ్బులు విడుదల చేస్తామని చెప్పి... 19 రోజుల కావస్తున్నా వారికి డబ్బులు చెల్లించలేదు. ఒక వైపు ప్రైవేటు ఆసుపత్రులు అనధికారికంగా డబ్బులు వసూలు చేయకూడదని జిల్లాల కలెక్టర్లు సమావేశం పెట్టి చెబుతుంటే... మరోవైపు నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించకపోవడం దారుణం. ఇంత దారుణంగా వైద్యరంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. గిరిజనులకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందే అవకాశమున్న... పాడేరులో ప్రభుత్వ అసమర్ధత వల్ల అందకుండా పోతున్న పరిస్థితి. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన పిల్లలు ఆనారోగ్యం పాలైతే... దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్ధితి వచ్చింది. ఇద్దరు బాలికలు కూడా చనిపోయారు. పార్వతీపురం మన్యం, పాడేరు లాంటి చోట్ల మెడికల్ కాలేజీలు వస్తే... వారికి మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్ల కూడా ప్రభుత్వ చేతగానితనం వల్ల వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని తక్షణమే తొలగించాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. 50 మెడికల్ సీట్లు కోల్పోవడానికి కారణమైన అధికారులను తక్షణమే తొలగించి.. సమర్ధులైన అధికారులను నియమించి, కోల్పోయిన 50 మెడికల్ సీట్లను తిరిగి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ● వైయస్.జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యం ? మాచర్ల నుంచి గుంటూరు వైద్యం కోసం వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఎంతోమంది వైద్యం అందక మార్గమధ్యలోనే చనిపోతున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ దాదాపు 70 శాతం పూర్తైతే.. ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అయినా మెడికల్ కాలేజీల పనులు నత్తనడకన సాగుతుండడంపై శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న ఇలాంటి చోట్ల నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.