ఒక్క పేద మహిళకైనా ఇల్లు కట్టించారా? 

 కూటమి ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి

 కర్నూలు జిల్లా: రాష్ట్రంలో ఒక్క మహిళకైనా సొంత ఇంటి కోసం సెంటు భూమి కేటాయించారా అని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూట‌మి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. నిరుపేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టించామని నిరూపించగలరా అంటూ  నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ధ్వ‌జ‌మెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేద మహిళలకు గృహాల కల నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సవాల్ విసిరారు.  రూ.3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేశారని ఆరోపించిన విరుపాక్షి, ఆ డబ్బుతో ఏమి చేశారని అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు తానా తందాన అంటూ కాలం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు.

తమ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో 71 వేల ఎకరాలు కేటాయించి, 31 లక్షల 19 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేసి అందించామని పేర్కొన్నారు. పేదల గృహ కలను నిజం చేసిన ఘనత తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరించి, హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడుతూ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విరుపాక్షి హెచ్చరించారు. 

Back to Top