రాజ్యసభలో ఏపీ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన

 కేంద్ర జోక్యం కోరిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తావించారు. జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. 33 సంవత్సరాల సర్వీసు పూర్తయితే కంపల్సరీ రిటైర్మెంట్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర అభద్రత నెలకొందని అన్నారు. దీని వల్ల అనేక మంది ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఫలితంగా నాలుగేళ్ల సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు, పెన్షన్ బెనిఫిట్స్ కోల్పోతున్నారని వివరించారు.

ఇప్పటికే పే రివిజన్ కమిషన్ (PRC) ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని, డిఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలుగా చెల్లించకుండా ఉన్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ సెటిల్మెంట్ కోసం రెండేళ్ల వరకు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీకి జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, సచివాలయ ఉద్యోగులకు అధిక సర్వే టార్గెట్లు విధిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు అనుకూల విధానాలు అమలు చేశామని గుర్తు చేస్తూ, రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే PRC అమలు చేసి, డిఏ పెంపు, బకాయిల క్లియరెన్స్ వంటి చర్యల ద్వారా ఉద్యోగులకు పూర్తి మద్దతు ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత మరియు సర్వీస్ కండిషన్స్ అమలు అయ్యేలా చూడాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
 

Back to Top