ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

రాజాంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం 

విజయనగరం జిల్లా: అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండి సేవలందిస్తున్న నాయకులను అభినందిస్తూ, ఇదే స్పూర్తితో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించగలమని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.  రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజాం పట్టణంలోని శ్రీ వెంకట సూర్య దుర్గా కళ్యాణ మండపంలో, వైయ‌స్ఆర్‌సీపీ రాజాం అసెంబ్లీ ఇంచార్జ్ డా. రాజేష్ తలే ఆధ్వర్యంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నాలుగు మండలాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఆత్మీయంగా సత్కారం అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు తదితరులు హాజరై సర్పంచ్‌లకు శాలువాలు, మెమెంటోలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు సేవలందించిన సర్పంచ్‌ల కృషిని గుర్తించి సన్మానించడం గర్వకారణమని తెలిపారు. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సర్పంచ్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి ప్రదర్శించారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగే పరిస్థితి కనిపించడం లేదని, అప్పటి వరకు సర్పంచ్‌లు తమ బాధ్యతను కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సమస్యలు వచ్చినప్పుడు స్పందించే నాయకత్వం అవసరమని, పదవీకాలం పూర్తయ్యాక కూడా ప్రజా క్షేత్రంలో ఉండాలని చిన్నశ్రీను సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టౌన్ పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top