హైదరాబాద్: వైయస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Hyderabad Visit) రాకతో హైదరాబాద్ నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనతో ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం.. ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. భారీ ర్యాలీగా నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో వైయస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. వైయస్ జగన్ రాక నేపథ్యంతో హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని.. న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. ‘‘హాజరును కోర్టు రికార్డు చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు’’ అని వైయస్ జగన్ తరఫు లాయర్ మీడియాకు తెలిపారు. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్‌పాండ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఆపై పర్యటన ముగించుకుని తిరుగు పయనం అయ్యారు.