తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం,వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ హాయంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను.. పీపీపీ పేరుతో చంద్రబాబు తనవారికి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం కమిషన్లు, కిక్ బ్యాగుల కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నారని... అయినా చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అయితే ప్రజల దోపిడీ ఖాయమని.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. చివరకు ఆరోగ్యశ్రీ ని సైతం ఇన్సూరెన్స్ మోడ్ లోని తీసుకెళ్లడం ద్వారా ... ఉగాది నుంచి ఈ పథకాన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆమె మండిపడ్డారు. అదే జరిగితే వైద్యం కోసం పేదలు ఆస్తులమ్ముకునే దుస్దితి వస్తుందని ఆక్షేపించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... ప్రైవేటీకరణ నిరసిస్తూ ప్రజాగళం... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. తమ సంతకం రూపంలో కోటి సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీని ద్వారా తమ గళం వినిపించారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు నిర్ణయంపై ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అమ్మకం.. ఇటీవల తరచూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు మాటల వెనుక అసలు ఉద్దేశం ఇప్పుడు అర్ధం అయింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఇన్సూరెన్స్ మోడల్ లో తీసుకెళ్లి కార్పొరేట్ కు అప్పగించాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్యను అందించే బాధ్యత నుంచి తప్పుకుని... మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ రెండింటినీ ప్రైవేటైజేషన్ చేసే ప్రక్రియలో వేగంగా వెళ్తూ.. వీటిని ప్రజలకు దూరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయాలనుకున్న చంద్రబాబు నిర్ణయాన్ని వైయస్ఆర్ సీపీతో పాటు వివిధ పార్టీలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ప్రజలు సైతం ముందుకొచ్చి వైయస్ఆర్‌సీపీ చేపడుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు పట్టించుకోకుండా.. కోటి మంది గొంతెత్తి తన నిరసన తెలియజేసినా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోంది. కొంతమంది విద్యార్ధి సంఘాల నేతలు సైతం... మంత్రి లోకేష్ ని కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన సైతం పీపీపీకి కట్టుబడి ఉండడం అత్యంత బాధాకరం. కేవలం కాసుల కోసం... రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సైతం పణంగా పెట్టి ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా పీపీపీ ప్రక్రియను వేగవంతం చేస్తూ... ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను సుమారు రూ.8,500 కోట్ల నిధులను కూడా టై అప్ చేశారు. కాలేజీల కోసం అవసరమైన భూమి సేకరించి... మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటుచేసి.. పనులు పూర్తైన 5 కాలేజీల ప్రారంభించారు. మరో 2 కాలేజీలు ప్రారంభానికి సిద్ధం చేశారు. మిగిలిన 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. పేద ప్రజలకు వైద్యసేవలు, వైద్య విద్యను అభ్యసించే పేద విద్యార్ధులకు మేలు జరుగుతుందన్న కనీస ఆలోచన కూడా చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కు వెళ్లడం దుర్మార్గం. దీనికి తోడు పీపీపీ విధానం మంచిది అని చెప్పడం మరింత దారుణం. పీపీపీతో పేదలకు దూరమవుతున్న వైద్యవిద్య... పీపీపీ విధానంలో 70 శాతం ఉచితంగా ఇస్తారని చంద్రబాబు చెబుతున్నాడు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 50 శాతం ఉచితంగా ఇవ్వడంతో పాటు మిగిలిన 50 శాతం కాలేజీ నిర్వహణ, స్వయం సమృద్ది దిశగా ఆలోచన చేసి కనీస ఫీజుతో సెల్ఫ్ పైనాన్స్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇవాల కూటమి ప్రభుత్వం వాటిన్నంటినీ పక్కనపెట్టి.. మౌలికసదుపాయాలుతో పాటు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి... వాళ్లకు మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరోవైపు పేద విద్యార్ధులకు మెడికల్ విద్యను దూరం చేస్తోంది. ఉచితంగా అందే వైద్య సేవలను ఖరీదుగా మార్చేస్తూ... దాన్ని సమర్ధించుకోవడం అత్యంత దారుణం. ఈ నేపధ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటం చేస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించింది. దీంతో పాటు విద్యార్థి, యువజన విభాగం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి కార్యాచరణ వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటైజషన్ ప్రక్రియను రద్దు చేసేంతవరకు కూడా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఆరోగ్యశ్రీకి మంగళం పాడుతున్న చంద్రబాబు.. 2007లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ పథకం లక్షలాది మంది పేదలకు అండగా నిలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆరోగ్యశ్రీ అంటే ప్రజల మనస్సులో డాక్టర్ వైయస్.రాజశేఖర రెడ్డి మానసపుత్రిక. కాబట్టి ఈ పథకానికి చంద్రబాబు ఎన్ని పేర్లు పెట్టి అమలు చేసినా రాజశేఖరరెడ్డే ప్రజలకు గుర్తుకు వస్తారు, మరోవైపు ఆరోగ్యశ్రీని మరింత మెరుగ్గా అమలు చేసిన వైయస్.జగన్ ను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారు. కాబట్టి వీళ్ల మీద ఉన్న కక్షతో ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేయాలని సంకల్పించి.. ఇన్సూరెన్స్ మోడల్ అని స్టడీ చేస్తూ ఎట్టకేలకు ఏప్రిల్ 1, ఉగాది నాటికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఈ పథకాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్న ఆలోచన తప్ప.. పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు. వైయస్.జగన్ హయాంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచారు. దాన్ని ఇవాళ చంద్రబాబు కొత్తగా కనిపెట్టినట్టు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అందులోనూ కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే కవర్ చేస్తామని చెబుతున్నారు. దారిద్ర్య రేఖకు పైనున్న వారికి రూ.2.50 లక్షలు మాత్రమే కవర్ చేస్తామంటున్నారు. ఈ విధంగా కోతలు పెడుతూ.. దానిలోనూ వంద నిబంధనలు పెడుతూ పేద ప్రజలకు అందించాల్సిన ఉచిత వైద్యాన్ని వారికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులు ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని నిలిపివేసి చేతులెత్తేశాయి. ప్రభుత్వం వారిని పిలిచి వన్ టైం సెటిల్మెంట్ అంటూ బేరాలాడుతోంది. ఇక ఆ పథకాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నామని చెప్పేటప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేస్తారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.3వేల కోట్లు బకాయిలు కోసం నెట్ వర్క్ ఆసుపత్రులు ధర్నాకు దిగితే వారితో వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడుతున్నారంటే.. చంద్రబాబు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైయస్.జగన్ హయాంలో ఆరోగ్యశ్రీలో ఉన్న 1000 పైగా ఉన్న ప్రొసీజర్స్ ని 3257 కు పెంచారు. అన్ని నెట్ వర్క్ ఆసుపత్రులకు ఏ రకమైన ఇబ్బందులున్న వాటిని తక్షణమే పరిష్కరించారు. సకాలంలో వారి బకాయిలును చెల్లించాం. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. 2300 వరకు నెట్ వర్క్ ఆసుపత్రులను పెంచారు. దీంతో పాటు మెరుగైన అత్యాధునిక వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రాకుండా... ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మాణానికి శ్రీకారం చుడితే... చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కాసులు కోసం కక్కుర్తితో వాటినిప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైయస్.జగన్ హయాంలో వైద్యం కోసం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే... మందులు, వైద్యుల కొరత లేకుండా చూడ్డం కోసం జీరో వేకెన్సీ పాలసీతో అన్ని పోస్టుల భర్తీ చేశారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి వైద్య,ఆరోగ్య రంగంపై కనీస చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఆరోగ్య ఆసరా నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వ్యక్తి... ఇంటికి వెళ్లి తన పని తాను చేసుకోలేని పరిస్ధితుల్లో ఉంటాడు కాబట్టి అలాంటి వారి కోసం నెలకు రూ.5వేల చొప్పున ఆరోగ్య ఆసరా పేరుతో అందిస్తే.. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆసరా పథకం ఊసేలేకుండా పోయింది. వైయస్.జగన్ ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, కొత్త ఆసుపత్రులు నిర్మాణం వంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు పాలనలో నిల్చిపోయాయి. కారణం ప్రైవేటీకరణ ఒక్కటే చంద్రబాబు నాయుడి ఆలోచన. దానికి తగినట్లుగా ఆయన అడుగులు వేస్తున్నాడు. తనకు సంబంధించిన వాళ్లకు, కార్పొరేట్లకు అప్పజెప్పే వీలైనంత వేగంగా అప్పజెప్పడానికి ఉన్న శ్రద్ధ మరేదానిమీద చంద్రబాబుకు లేదు. చంద్రబాబు దయవలన రాబోయే రోజుల్లో మెరుగైన ఆధునిక వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు పేదలు అప్పులు చేసి, ఆస్తులమ్మి వెళ్లే రోజులు రాబోతున్నాయని విడదల రజిని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేకపోయినా... వారి ఆరోగ్యాన్ని మాత్రం నాశనం చేయవద్దు అని ప్రభుత్వానికి సూచించారు.