విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఏపీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని... రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఫలితమే ఏపీ పోలీసుల పనితీరు దేశంలో అట్టడుగు స్థాయికి పడిపోయిందని మండిపడ్డారు. చివరకు బీహార్ వంటి రాష్ట్రాల కంటే వెనుకబడి... అత్యంత దారుణంగా 36వ స్ధానానికి దిగజారడం.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ గా మారి,. ప్రజల రక్షణ కోసం ఉపయోగపడాల్సిన పోలీసింగ్...అరాచకాలు, అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులకు అడ్రస్ గా మారిందని ఆక్షేపించారు. ప్రజల రక్షణలో విఫలమైన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే... ● కూటమి పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు... కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికీ రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్వవస్ధ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తోంది. ఫలితంగా బీఎన్ ఎస్ ఎస్ చట్టాల పనితీరు, అమలుపై కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్ధానంలో నిలబడ్డమే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు, ఆయా రాష్ట్రాలలో పోలీసుల వ్యవస్థ అనుసరిస్తున్న విధం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 36వ స్ధానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటి కన్నా చివరిస్థానం వచ్చింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా దిగజారిపోయింది. ఇది నిజంగా సిగ్గుచేటు. 100కు 16.70 పాయింట్లుతో మన రాష్ట్రం చిట్టచివర నిలిచింది. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థను నిలదీశారు. శాంతిభద్రతలు శాఖను పర్యవేక్షించే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, షాడో సీఎం లోకేష్ ముగ్గురూ పెయిలయ్యారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకున్నారు. ● అన్ని రంగాల్లో అట్టడుగున ఏపీ పోలీస్... గతంలో ఐపీసీ, సీఆర్ పీసీ చట్టాలుండేవి....వాటి స్ధానంలో భారతీయ నాగరికా సురక్ష సంహిత చట్టాలు(బీఎస్ ఎస్ ఎస్ ), భారతీయ న్యాయ సంహితా చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న డమ్మీ ముఖ్యమంత్రి, డమ్మీ హోంమంత్రిల అసమర్థ పాలనే వల్లే ఈ చట్టాలు అమల్లో దారుణంగా విఫలమైంది. పోలీసు వ్యవస్థను అరాచకాలు, అక్రమ కేసులు పెట్టడానికి, అడ్డగోలు అరెస్టులకు, అవినీతి అడ్రస్ గా కూటమి ప్రభుత్వం మార్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప.. అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. ప్రతిపక్ష నాయకుల మీదా, పోలీసుల మీద అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రజలను వేధించడానికీ పోలీసులు ఉపయోగించుకుంటున్నారు తప్ప... ప్రజల రక్షణ కోసం ఉపయోగించని పరిస్ధితి ఈ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్ధం అయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ద్వారా... సమాచార సాంకేతిక రంగంలో 25 పాయింట్లకు గానూ మన రాష్ట్రం సాధించిన పాయింట్లు 0... ఇక ఇంటిగ్రేషన్(సమన్వయం)లో 10 పాయింట్లకు గానూ అందులో 0 పాయింట్లు రాగా, ఆపరేషన్ ఎఫిషియన్సీలో పోలీస్ శాఖలో 45 పాయింట్లకు గానూ... 7.93 పాయింట్లు, పాలనా సంస్కరణల్లో 20 పాయింట్లుకు గానూ.. .8.77, ఇలా మొత్తం 100 పాయింట్లకు 16.70 పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న స్థాయికి దిగజారిపోయిన ఈ పోలీసు వ్యవస్థను చూసి కూటమి నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలి. ● వైయస్.జగన్ హయాంలో తలెత్తుకునేలా ఏపీ పోలీస్... వైయస్.జగన్ ప్రభుత్వంలో పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేలా పరిపాలించారు. ఒకే ఏడాది 85 అవార్డులు తెచ్చుకుని నాడు దేశంలోనే అత్యున్నత స్ధాయిలో ఉన్న మన రాష్ట్ర పోలీసులు ఇవాళ కేంద్రహోంశాఖ నివేదికలో 36 వ స్ధానం అంటే అట్టడుగు స్ధానానికి దిగజారింది. చిన్న, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా వెనుకబడ్డామంటే మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలాంటి పరిస్ధితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైయస్.జగన్ హయాంలో ఏపీ పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్తే తలెత్తుకుని సెల్యూట్ చేయించుకునే పరిస్థితి నుంచి నేడు.. తలదించుకునే స్థితిని కూటమి ప్రభుత్వం నేతలు కల్పించారు. ఫెయిల్యూర్ సీఎం, ఫెయిల్యూర్ హోం మంత్రి వల్లే ఈ దుస్థితి వచ్చింది. ● రక్షక భటులును భక్షక భటులుగా మార్చిన బాబు పాలన.. కేంద్ర ప్రభుత్వ నివేదికలో 72.03 శాతంతో అస్సాం మొదటిస్ధానంలో నిలబడగా, హర్యానా 62.70 పాయింట్లతో రెండో స్ధానంలోనూ, 60.87 శాతంతో సిక్కిం మూడో స్ధానంలోనూ, జమ్మూ కాశ్మీర్ 59 శాతంతో నాలుగోస్దానం సాధించగా చివరకు 47.92 శాతంతో బీహార్ లాంటి రాష్ట్రం కూడా 15 వ స్ధానం సాధించగా... 45 పాయింట్లతో మణిపూర్ 21 స్ధానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం 16.70 పాయింట్లతో అట్టడుగు స్థాయికి దిగజారిపోవడం సిగ్గుచేటు. సమాజంలో తల్లి తర్వాత తప్పులను సరిదిద్దే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుంది. అలాంటి పోలీసులతోనే కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. గతంలో వైయస్.జగన్ హయాంలో ఏ పోలీసులు ఉన్నారో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే పోలీసులు ఉన్నారు. కానీ చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఈ పోలీసులు తమ విధినిర్వహణలో విఫలమయ్యారు. ఈ ప్రభుత్వం రక్షక భటులను భక్షక భటులుగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని.. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీసుగా మార్చివేశారు. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ఇండియన్ పోలీస్ పనిష్‌మెంట్ సర్వీసుగా మార్చివేసిన పరిస్థితి. దేశమంతా బీఎన్ ఎస్ యాక్ట్ ని ప్రజల కోసం వాడితే.. ఏపీలో మాత్రం బాబు రాజకీయ న్యాయసంహిత యాక్ట్ కింద మార్చివేశారు. నిష్పాక్షపాతంగా డ్యూటీ చేసే పోలీసులను ఎల్లో దుస్తులుగా మార్చివేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సింహాలను తమ దుస్తులపై ధరించే పోలీసులను... మూడు పార్టీలకు తొత్తులుగా మార్చేయడమే కాకుండా.. వాళ్ల చేతుల్లో పోలీసులను కీలుబొమ్మలుగా మార్చివేశారు. ధర్మానికి ప్రతీక నిల్చిన అశోక చక్రాన్ని ధరించిన వాళ్లను అధర్మానికి ప్రతినిధిలుగా మార్చివేశారు. ఇంద ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం కూటమి నాయకులుకే చెల్లుతుంది. ● ఇది ముంచే ప్రభుత్వం... పోలీసులు వైఫల్యం చెందేటట్టుగా.. బీఎఎన్ ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం 36వ స్ధానానికి దిగజారేటట్టుగా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరలా ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. ఇదేనా గుడ్ గవర్నెన్స్, ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ , ఇదేనా నాలెడ్జ్ హబ్. ఇది ముమ్మాటికీ బ్యాడ్ గవర్నెన్సే. ఇది ముంచే ప్రభుత్వం అని ప్రజలకు అర్ధం అయింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా సీఎం చంద్రబాబు తన సొంత సర్వేలో పోలీస్ శాఖ 20వ స్ధానానికి దిగజారిపోయింది. అంటే ప్రజలు, ప్రతిపక్షాల అభిప్రాయలనే కేంద్ర హోంశాఖ నిర్ధారించింది. ప్రజలు, ప్రతిపక్షాలు, బాధితులు అందరూ పోలీసులనే తప్పుపట్టే పరిస్థితిని కూటమి పెద్దలు కల్పించారు. చివరకు డీజీపీ నుంచి మంగళగిరి సీఐ వరకు హైకోర్టు అక్షింతలు వేసిన పరిస్థితినీ చూశాం. ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ విఫలమవడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణం. కేవలం 17 నెలల పాలనలోనే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారిన పరిస్థితి గతంలో మనమెప్పుడూ చూడలేదు. ● అన్ని వర్గాల ప్రజల రక్షణలోనూ ఫెయిలైన కూటమి... మహిళలపై అరాచకాలను నియంత్రించడంలో ఫెయిల్, చిన్నారుల అఘాయిత్యాలను నియంత్రించడంలోనూ, ఆడబిడ్డలపై రేప్ లను నియంత్రించడంలోనూ, అక్రమ మద్యం అరికట్టడంలోనూ, బెల్టుషాపులు, డ్రగ్స్ అరికట్టడంలోనూ, గంజాయి ఉత్పత్తిని, సరఫరాని ఆపడంలోనూ, ఈవ్ టీజింగ్ అరికట్టడంలోనూ, ర్యాగింగ్ నియంత్రించడంలోనూ మొత్తంగా శాంతిభద్రతల పరిరక్షణలోనూ.. ఇలా ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం విఫలమైంది. తద్వారా పోలీస్ వ్యస్ధను ఫెయిలయ్యేలా చేసింది. ముంబై హీరోయిన్ కోసం డీజీ స్థాయి పోలీసు అధికారుల మీద కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. పీఎస్సార్ ఆంజనేయుల గారెని జైలుకు పంపించారు. విజయవాడ సీపీ క్రాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ప్రతిపక్షాలతో పాటు పోలీసులను కూడా కూటమి ప్రభుత్వం వేదింఛింది. ఆ రోజు చంద్రబాబు పై స్కిల్ స్కాం కేసు పెట్టారని ఆడిషనల్ డీజీ సంజయ్ ని అక్రమ కేసులో జైలుకు పంపించారు. చివరకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులనూ జైలుకు పంపించడం ద్వారా .. తమ విధులు తాము నిర్వర్తించే అవకాశం లేకుండా కూటమి నాయకులు దిగజార్చారు. సుప్రీం కోర్టు, హైకోర్టు చీవాట్లు పెట్టిన అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. కేవలం వైయస్ఆర్‌సీపీ నాయకుల మీదే 1200 అక్రమ కేసులు పెట్టారు. చిన్నారుల పై జరుగుతున్న లైంగిక అకృత్యాల్లో నిందితులుగా టీడీపీ నేతలే ఉన్నా వారిని అరెస్టు చేయడం లేదు. జైల్లో ఉన్న శ్రీకాంత్ లాంటి ఖైదీలకు పెరోల్ ఇవ్వడానికి హోంమంత్రి, ఎమ్మెల్యేలు తాపత్రయపడ్డారు. దానివల్లే లా అండ్ ఆర్డర్ ఇంత ప్రమాదకరస్ధాయిలోకి దిగజారిపోయింది. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ కి రక్షణ కల్పించడానికి మాత్రం పోలీసులను ఉపయోగించడం లేదు. సాక్షాత్తూ స్పీకరే పోలీసులను బూతులు తిడుతున్నా ఎలాంటి చర్యలుండవు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని, తిట్టినా, బెదిరించినా ఎలాంటి చర్యలూ ఉండవు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అందరి ముందు తిట్టినా నో యాక్షన్. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పోలీస్ అధికారిని ఇంటికి పిలిచి యూనిఫామ్ విప్పించి మరీ అవమానించాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీసులను ఉపయోగిస్తున్నారే తప్ప... అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడం లేదు. అయినా కూడా హోంమంత్రి ఎందుకు వీటన్నింటిపైనా స్పందించలేదు? నిత్యం వైయస్.జగన్ ను నిందించడానికే ప్రెస్ మీట్లు పెట్టే హోంమంత్రి అనితకు.. తన శాఖ పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ కార్డు వచ్చింది. దానిపై ఎందుకు మాట్లాడ్డం లేదు? మీరు హోంమంత్రి అయ్యాక ఒక బాధిత మహిళలకు అండగా ఉన్నారా? ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారా? శాంతి భద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. చిత్తశుద్ధి, నైతిక విలువలు ఉంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలి. హోంమంత్రిగా ప్లాప్ అయిన మిమ్నల్ని పాయకరావుపేట ఎమ్మెల్యే అని పిలుద్దామంటే మీకు ఓట్లేసిన ప్రజలే మిమ్నల్ని ఛీకొడుతున్నారు. ఆ రోజు రాజంపేట వెళ్లినప్పుడు మత్స్యకారులు ఏ విధంగా తరిమి కొట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కూటమి ప్రభుత్వం విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహించింది. దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఎవరూ రాకపోవడం వల్ల... పాత ఎంఓయూలనే మరలా రిపీట్ చేసి తూతూ మంత్రంగా నడిపించారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు, మహిళలకు, పోలీసులుకు, న్యాయవాదులకు కూడా రక్షణ లేని పరిస్థితి. అందుకే హోంశాఖ నివేదికలో రాష్ట్రం 36 వ స్ధానానికి దిగజారింది. వైయస్.జగన్ హయాంలో మహిళల రక్షణకు పెద్ద పీట వేశారు. దిశ లాంటి గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి.. 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు 18 మంది డియస్పీ స్థాయి అధికారులను దిశ పోలీస్ స్టేషన్లలో నియమించారు. దిశా యాప్ 1.30 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందారు. ప్రతి నెలా శాంతిభద్రతల మీద మహిళల రక్షణ మీద సమీక్ష నిర్వహించారు. ఇవాళ కూటమి పాలనలో తలదించుకునే పరిస్థితి. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు వైయస్.జగన్ హాజరైతే.. కోర్టు లోపలి విజువల్స్ ని కూడా చిత్రీకరించి ట్రోల్ చేస్తున్నారు. అంటే కూటమి నాయకులు ఎంత దారుణంగా దిగజారిపోయారంటే.. కోర్టులోపల విజువల్స్ బయటకు రాకూడదు. చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులున్నాయి. అతను కూడా కోర్టుకు హాజరయ్యాడన్న విషయం మర్చిపోయారు. మీ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంతలా దిగజారి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా స్కిల్ స్కామ్, అసైన్డ్ , ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. రూ.31.20 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు సైతం జప్తుచేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం సంస్ధ ఈడీ కూడా విచారణ చేసింది. ఇన్ని కేసులు చంద్రబాబు మీదన్నాయి. వైయస్.జగన్ పై కేసులకు కారణం.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నమోదు చేసిన అక్రమ కేసులే. ఇప్పటికైనా కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీసులను ఉపయోగించుకోవడం మానేసి... ఆంబేద్కర్ రాజ్యాంగం అమలుకు కృషి చేయాలి. ప్రజలు కట్టిన పన్నులతో విలాసాలు చేస్తూ... స్పెషల్ ఫైట్లలో విహరిస్తున్న కూటమి నేతలు ఆ ప్రజలకు రక్షణ కల్పించకపోవడం అత్యంత దారుణం. ఇప్పటికైనా ప్రజల, మహిళలు, చిన్నారుల రక్షణ కోసం పోలీసులను ఉపయోగించాలని వరుదు కల్యాణి డిమాండ్ చేశారు.