పేదల‌కు వైద్య విద్య‌ను దూరం చేయ‌డం అన్యాయం

వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్ర‌తినిధి పోతిన వెంక‌ట మ‌హేష్‌

విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

విజ‌య‌వాడ‌:   మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేసి పేద‌ల‌కు వైద్య విద్య‌ను దూరం చేయ‌డం అన్యాయ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్ర‌తినిధి పోతిన వెంక‌ట మ‌హేష్ మండిప‌డ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి పిలుపున‌కు మద్దతుగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గం చిట్టినగర్ కూడలిలో ఏర్పాటు చేసిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ..“ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. ప్రజలు స్వఛ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. పేదవారి వైద్యాన్ని ప్రభుత్వం దూరం చేయడం అన్యాయమని” అన్నారు.

“అనారోగ్యం వచ్చినప్పుడు లక్షలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదవారు ఎలా చికిత్స పొందగలరు? పేదల పిల్లలు వైద్య విద్య చదవకూడదా? పేద సామాజిక వర్గంలో పుట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు నచ్చదా?” అని తీవ్రంగా మండిపడ్డారు.

“చంద్రబాబు, పవన్, లోకేష్ హెలికాప్టర్లలో తిరగడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతున్నారు. కానీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం 5 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం సిద్ధం కావడం లేదు. ప్రజా సంక్షేమాన్ని, పేద ప్రజల డాక్టర్ అవ్వాలనే కలను భగ్నం చేసే ఈ కుట్రలను ప్రజలు సహించరు” అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఈ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని పోతిన వెంకట మహేష్ హెచ్చరించారు. 

Back to Top