వ్య‌వ‌సాయంపై చంద్ర‌బాబుకి చిత్తశుద్ధి లేదు

ఆయ‌న ఎప్పుడు సీఎం అయినా ఎక్కువ‌గా న‌ష్ట‌పోతున్న‌ది రైతులే 

డ్రోన్, ఏఐ టెక్నాల‌జీల పేరుతో మ‌ళ్లీ మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం 

కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు జ‌రుగుతున్న మోసాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ధ్వ‌జం   

రాజ‌మండ్రిలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన తూర్పు గోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ 
అధ్య‌క్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు రామారావు (బాబి)

అన్న‌దాత సుఖీభవ ప‌థ‌కం పేరుతో రైతుల‌కు రూ. 17 వేల కోట్ల వంచ‌న

రెండేళ్ల‌లో రూ. 40 వేల‌కుగాను ఇచ్చింది కేవ‌లం రూ. 10 వేలే

రెండు విడ‌త‌ల్లో ఇచ్చిన మొత్తం కేవ‌లం రూ. 4,685 కోట్లు మాత్ర‌మే

రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రూ.34,378 కోట్లు అంద‌జేసిన వైయ‌స్ జ‌గ‌న్ 

ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప‌, కూట‌మి పాల‌న‌లో ఏ పంట‌కూ గిట్టుబాటు ధ‌ర లేదు

మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  

మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో మీడియా సాక్షిగా బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం

వైయ‌స్ఆర్‌సీపీ మీద నింద‌లు మోపితే స‌హించేది లేదు

వేదిక సిద్ధం చేసి చెబితే ఎక్క‌డికైనా వ‌స్తా.. 

శెట్టి బ‌లిజ‌ల‌కు ఏ పార్టీ అన్యాయం చేసిందో ఆధారాల‌తో స‌హా వివ‌రిస్తా 

దీటుగా బ‌దులిచ్చిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 

రాజ‌మండ్రి: వ్య‌వ‌సాయం, రైతు స‌మ‌స్య‌ల‌పై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న ఎప్పుడు సీఎం అయినా రైతులకు అన్యాయం జ‌రుగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపించారు. రాజ‌మండ్రిలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో తూర్పు గోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు రామారావు (బాబి) మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేక విధానాల‌తో ప్ర‌తిసారీ ఎక్కువ‌గా న‌ష్ట‌పోతున్న‌ది రైతులేన‌ని, అయినా డ్రోన్‌, ఏఐ టెక్నాల‌జీల పేరుతో మోసం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం సిగ్గుచేట‌ని వారు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 2014-19 మ‌ధ్య రైతు రుణ‌మాఫీ పేరుతో మోసం చేసిన చంద్ర‌బాబు, ఇప్పుడు కూడా ఒక్క అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం పేరుతోనే రెండేళ్ల‌లో రైతుల‌కు రూ.17 వేల కోట్లు న‌ష్టం చేశాడ‌ని వివ‌రించారు. దాదాపు 7 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప‌థ‌కం ఎగ్గొట్ట‌డ‌మే కాకుండా కౌలు రైతుల‌ను క‌నీసం రైతులుగా కూడా చంద్ర‌బాబు గుర్తించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేదు కాబ‌ట్టే మొక్క‌జొన్న, అరటి, వేరుశెన‌గ‌, ప‌త్తి పంట‌లు కోత‌కొస్తే క‌నీసం రివ్యూ  కూడా చేయ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో తాను మీడియా సాక్షిగా బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని మాజీ మంత్రి చెల్లుబోయిన చెప్పారు. 
వారు ఇంకా ఏమ‌న్నారంటే

ఆయ‌న సీఎం అయిన ప్ర‌తిసారీ వైప‌రీత్యాలే 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్ర‌కృతి వైప‌రీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, రైతులపై కాల్పులు జ‌రిపిన దుర్ఘ‌ట‌న‌లు త‌ప్పించి మేలు చేసిన సంఘ‌ట‌న‌లు అరుదుగా కూడా క‌నిపించ‌వు. రాష్ట్రంలోని ప్ర‌తి రైతూ ముక్త‌కంఠంతో అనే మాట ఒక్క‌టే.. చంద్ర‌బాబు, క‌రువు క‌వ‌ల పిల్ల‌లు అని. ప‌త్తి, వేరుశెన‌గ‌, అర‌టి, మొక్క‌జొన్న పంట‌లు కోత‌కొచ్చినా ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మీక్షించి మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంపై నిర్ణ‌యం తీసుకోలేదు. సీఎం చంద్ర‌బాబు, వ్య‌వ‌సాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స‌హా ఎవ‌రూ స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్టుగా టీడీపీ అనుకూల మీడియాలో సైతం ఎక్క‌డా వార్త‌లు కూడా రాలేదు. ఇది రైతు గోడు పట్టని దగా ప్ర‌భుత్వం, చంద్ర‌బాబుకి రైతుల‌న్నా, వ్య‌వ‌సాయ‌మ‌న్నా ఇష్ట‌ముండ‌దు అని మేం చేసే ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికే వంద‌ల సంద‌ర్భాల్లో రుజువ‌య్యాయి. ఇప్పుడు మ‌రోసారి వారే రుజువు చేసుకున్నారు. 

మొక్క‌జొన్న: మొక్క‌జొన్న పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.2,400 ఉంటే రూ. 1700ల‌కు మించి కొనుగోలు చేయ‌డం లేదు. ప‌క్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి కూడా మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క‌జొన్నను కొనుగోలు చేసి ధ‌ర‌లు స్థిరీకరించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్నా ఏపీలో ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి కూడా మొక్కజొన్న రైతుల‌ను గాలికొదిలేసింది. మార్కెట్ ఇంట‌ర్‌వెన్ష‌న్ స్కీమ్ ద్వారా రైతుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేయ‌డం లేదు. 

తేమ శాతం పేరుతో పత్తి రైతుల‌కు వేధింపులు: 
మొంథా తుపాన్ కార‌ణంగా ప‌త్తి రైతులు తీవ్రంగా నష్ట‌పోయారు. వారిని ఆదుకోవాల్సిందిపోయి సీసీఐ కేంద్రాలు తేమ శాతం, ప‌త్తి పంట రంగు మారింద‌ని చెప్పి పంట కొనుగోలు చేయ‌కుండా ఇబ్బంది పెడుతున్నాయి. తేమ శాతం 12 నుంచి 18శాతం ఉన్నా కొనుగోలు చేయాల‌న్న‌ నిబంధ‌న‌లున్నా సీసీఐ కేంద్రాలు పంట కొనేందుకు ముందుకురావడం లేదు. దీన్ని అవ‌కాశంగా చేసుకుని ద‌ళారులు త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. దీంతోపాటు సీసీఐ కేంద్రాల‌కు సంబంధంచిన యాప్‌లో స్లాట్ బుకింగ్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప‌త్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పంట కొనుగోలు చేయ‌డం లేదు. 54 వేలకు పైగా ఎక‌రాల్లో తుపాన్ కార‌ణంగా ప‌త్తి పంట‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్టు ప్రాథ‌మిక అంచనా వేసిన ప్ర‌భుత్వం, తుది నివేదిక‌లో మాత్రం కేవ‌లం 3,900 ఎక‌రాల్లో మాత్ర‌మే పంట న‌ష్టం జ‌రిగిన‌ట్టు చూపించి ఈ ప్ర‌భుత్వం రైతుల‌ను తీవ్రంగా వంచించింది. పీక‌ల్లోతు న‌ష్టాల్లో ఉన్న రైతుల‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వమే, న‌ష్ట‌ప‌రిహారం ఎగ్గొట్టేందుకు పంట న‌ష్టం త‌క్కువగా చూపించి మోసం చేసింది. గుంటూరు జిల్లాలో 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వం ఉన్న సురేష్ అనే కార్య‌క‌ర్త గిట్టుబాటు ధ‌ర లేద‌నే బాధ‌తో త‌న పత్తి పంట‌కు నిప్పు పెట్టాడు.  

అర‌టి కిలో రూపాయి 
రాయ‌ల‌సీమ‌లో చాలా విస్తృత‌స్థాయిలో సాగ‌య్యే అర‌టి పంట‌ను కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ట‌న్ను రూ.18 వేల వ‌ర‌కు విక్ర‌యిస్తుంటే ఇప్పుడు రూ.6వేలు కూడా ప‌ల‌క‌డం లేదు. కొన్నిచోట్ల ట‌న్ను వెయ్యి రూపాయ‌ల‌కు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి రైతుల‌కు ఎదుర‌వుతోంది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల‌న్న ప్ర‌య‌త్నం కూడా చేయ‌క‌పోవ‌డంతో ప‌శువుల‌కు దాణాగా వేస్తున్న ప‌రిస్థితి చాలా ప్రాంతాల్లో క‌నిపిస్తోంది. అర‌టి కిలో రూపాయి టీడీపీ అనుకూల ప‌త్రిక ఈనాడులో కూడా రాశారంటే పాల‌న ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయినా రైతుల‌ను ఆదుకోవాల‌న్న స్పృహ లేకుండా ఈ ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌పోతోంది. 

వేరుశెన‌గ రైతు అష్ట‌క‌ష్టాలు 
గ‌తంలోనే రైతులు పండించిన వేరుశెన‌గ పంట‌తో మార్కెట్‌లో గోడౌన్‌లు నిండిపోయి ఉన్నాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో పొగాకుకి ప్ర‌త్యామ్నాయంగా వేరుశెన‌గ పంట‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించింది. దీంతో పంట దిగుబ‌డి మ‌రింత పెరిగిపోయింది. కానీ కేంద్రం దిగుమ‌తి సుంకాలు త‌గ్గించ‌డం వల్ల ఇత‌ర దేశాల నుంచి వేరుశెన‌గ పంట రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌డంతో ఇక్క‌డ మ‌న రైతులు పండించే పంట‌కు డిమాండ్ త‌గ్గింది. త‌క్ష‌ణం దిగుమ‌తి సుంకం పెంచి రైతుల‌ను ఆదుకోవాలి. వీటితోపాటు మామిడి, మిర్చి, పొగాకు, చీనీ, ట‌మాట‌, సజ్జ‌, పెస‌ర‌, మినుము పంట‌ల‌కు కూడా గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేదు.  

చిత్త‌శుద్ధిలేని కంటితుడుపు ప్ర‌క‌ట‌న‌లు  
పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని రైతుల ప‌క్షాన ప్ర‌తిపక్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ రోడ్డెక్కిన ప్రతిసారీ కంటితుడుపు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారే కానీ చిత్త‌శుద్ధితో రైతుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ఉల్లి రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చి ఇంత‌వ‌రకు ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖ‌లాలు లేవు. క‌ర్నాట‌క రాష్ట్రంలో క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర చెల్లించి మామిడి పంట‌ను కొనుగోలు చేస్తుంటే, ఎన్డీఏలో కొన‌సాగుతున్న చంద్ర‌బాబు మాత్రం రైతుల గోడును ప‌ట్టించుకోవ‌డం లేదు. రైతుల నుంచి చౌక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసిన త‌ర్వాత మొక్కుబ‌డి ప్ర‌క‌ట‌న‌ల‌తో హ‌డావుడి చేయ‌డం త‌ప్పించి ఈ ప్ర‌భుత్వం రైతుల‌కు ఒర‌గ‌బెట్టింది శూన్యం. 

అప్పుడూ ఇప్పుడూ, అధికారులు వారే.. కానీ, 
రైతులు పండించే పంట‌ల‌కు మ‌ద్థ‌తు ధ‌ర చెల్లించి కొనుగోలు చేసేలా 2019 -24 మ‌ధ్య వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన ఆర్బీకే వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేసింది. విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు స‌మ‌యానికి అంద‌జేయ‌డం జ‌రిగింది. రైతుల‌ను ఆదుకోవ‌డం కోసం ఏర్పాటు చేసిన ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంట ఎప్పుడు చేతికొస్తుందో ముందుగానే అంచనా వేసి అందుక‌నుగుణంగా ప్ర‌భుత్వ యంత్రాగాన్ని అప్ర‌మ‌త్తం చేసేవారు. అప్పుడు ప‌నిచేసిన అధికారులే ఇప్పుడూ ప‌నిచేస్తున్నా.. గ‌తంలో మాదిరిగా ఇప్పుడు రైతుల‌కు మేలు జ‌ర‌గ‌డం లేదంటే కార‌ణం సీఎం కుర్చీలో వైయ‌స్ జ‌గ‌న్ లేక‌పోవ‌డ‌మే. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌తి ఎక‌రాకి ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కం కింద న‌మోదు చేసి ఆదుకోవ‌డం జ‌రిగింది. ఏ సీజ‌న్‌లో న‌ష్టం జ‌రిగితే వ‌చ్చే ఏడాది ఆ సీజ‌న్ ముగిసేలోపు ఇన్‌పుట్ స‌బ్సిడీ అందించ‌డం జ‌రిగేది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పంట‌ల బీమా ప‌థ‌కం కింద ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ వ‌చ్చిన దాఖ‌లాలు ఉన్నాయీ అని ప్ర‌శ్నిస్తున్నా. ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క రూపాయైనా చెల్లించి ఉంటే చూపించాలి. అన్న‌దాత సుఖీభ‌వ పేరుతోనూ రైతుల‌ను పూర్తిగా ప్రభుత్వం ద‌గా చేసింది. 7 ల‌క్ష‌ల మంది రైతుల‌ను ల‌బ్ధిదారుల జాబితాలో నుంచి తీసేసి వెన్నుపోటు పొడిచాడు. ఈ ప‌థ‌కాన్ని కౌలు రైతుల‌కు కూడా అంద‌కుండా చేశాడు. ప‌త్తి, వేరుశెన‌గ‌, మొక్క‌జొన్న, అర‌టి పంట‌ల‌కు ధ‌రల స్థిరీక‌ర‌ణ నిధి ద్వారా గిట్టుబాటు ధ‌ర చెల్లించి రైతుల‌ను ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున డిమాండ్ చేస్తున్నాం. 

 ఎప్పుడూ మోసపోతున్న వ‌ర్గం రైతులే 

చంద్ర‌బాబు కార‌ణంగా ఎక్కువ‌గా మోసాల‌కు గురైన వ‌ర్గం ఏదైనా ఉందంటే వారు రైతులు మాత్ర‌మే. ఎన్నిక‌ల్లో ఇచ్చి వాగ్ధానాలను అమలు చేయ‌కుండా వంచించిందే కాకుండా మాయ‌మాట‌ల‌తో రైతుల‌ను ఇంకా మోసం చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. వ్య‌వ‌సాయంలో ఏఐ టెక్నాల‌జీ తీసుకొస్తాన‌ని, డ్రోన్‌ల‌తో పురుగు మందులు చంపుతాన‌ని భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నాడు. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా చేస్తున్న చంద్రబాబు, త‌న పాల‌న‌లో ఏనాడూ రైతును ఆదుకునే ప్ర‌య‌త్నం సైతం చేయ‌లేదు. రైతులకు అంత‌గా చ‌దువుండ‌దు, ఏది చెప్పినా వింటార‌న్న భ్ర‌మ‌ల్లోనే ఇంకా బతుకుతున్నాడు. చిత్త‌శుద్ధితో రైతుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ఉచిత విద్యుత్ ఇస్తే క‌రెంట్ తీగ‌ల మీద బ‌ట్ట‌లు ఆరేసుకోవాల‌ని చెప్పిన చంద్ర‌బాబు.. వైయ‌స్సార్ ఎంతో గొప్ప ఆశ‌యంతో ప్రారంభించిన జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌నయ‌జ్ఞం అని ఎగ‌తాళి చేశాడు. రైతుల‌ను కాల్పుల్లో చంపించిన చంద్ర‌బాబు ఇప్ప‌టికీ అదే నియంత ఆలోచ‌న‌ల‌తోనే ఉన్నాడు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకి లేదు. చంద్ర‌బాబు దృష్టిలో కౌలు రైతులు అస‌లు రైతులే కాదు.  

అన్న‌దాత సుఖీభ‌వ‌ను అన్న‌దాత దుఃఖీభ‌వ‌గా మార్చేశారు
రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకున్న గొప్ప నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ఒక్క‌రే. ఎన్నిక‌లకు ముందు రైతు భ‌రోసా ప‌థ‌కం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500ల చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాన‌ని చెప్పి, అధికారంలోకి వ‌చ్చాక ఆ మొత్తాన్ని రూ. 13,500 ల‌కు పెంచడ‌మే కాకుండా నాలుగేళ్ల‌కు ఇస్తాన‌న్న సాయాన్ని ఐదేళ్ల‌కు పెంచి రూ. 67,500లు అంద‌జేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గన్‌కే ద‌క్కుతుంది. 
దాదాపు 54 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రూ.34,378 కోట్లు అంద‌జేశారు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా అడుగ‌డుగునా రైతుకు అండ‌గా నిల‌బ‌డ్డారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రైతు భ‌రోసా ప‌థ‌కానికి అన్న‌దాత సుఖీభ‌వ‌గా పేరు మార్చి కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌తో సంబందం లేకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇస్తాన‌ని న‌మ్మించాడు. రెండేళ్లలో ఒక్కొ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాల్సి ఉంటే రెండు విడ‌త‌ల్లో ఇచ్చింది మాత్రం కేవ‌లం రూ.10 వేలే. రెండు విడ‌త‌ల్లో ఇచ్చిన మొత్తం కేవ‌లం రూ. 4,685 కోట్లు మాత్ర‌మే. పైగా ల‌బ్ధిదారుల సంఖ్య‌లో 7 ల‌క్ష‌ల వ‌ర‌కు కోత విధించాడు. ఒక్క‌ అన్న‌దాత సుఖీభ‌వ పేరుతోనే రెండేళ్ల‌లో రూ.17 వేల కోట్లు రైతుకు మోసం జ‌రిగింది. చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేక విధానాల‌తో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అన్న‌దాత దుఃఖీభ‌వ‌గా మార్చేశాడు. రైతులు పండించిన ఏ ఒక్క పంట‌కూ గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేదు. కిలో అర‌టి రూపాయికి అమ్ముకోవాల్సి వ‌స్తున్నా, ప‌త్తి రైతులు పంట‌ల‌కు నిప్పు పెట్టుకుంటున్నా ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాలే కార‌ణం. 2014-19 మ‌ధ్య రైతు రుణ‌మాఫీ పేరుతో రైతుల‌ను వంచించిన‌ట్టుగానే ఇప్పుడు కూడా రైతుల‌ను వంచిస్తూనే ఉన్నాడు. ప్రతిప‌క్ష నాయ‌కుడు వెళ్లి రైతుల‌ను ప‌రామ‌ర్శిస్తే త‌ప్ప కేంద్రానికి లేఖ రాయాల‌న్న స్పృహ కూడా లేని నాయ‌కుడు చంద్ర‌బాబు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఐదేళ్లూ రైతులు వ్య‌వ‌సాయాన్ని పండ‌గ‌లా జ‌రుపుకొంటే, ఏడాదిన్న‌ర పాల‌న‌లోనే చంద్రబాబు వ్య‌వ‌సాయాన్ని దండగ‌లా మార్చేశాడు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పించ‌డంపై క‌నీసం రివ్యూ కూడా చేయ‌లేని దుస్థితిలో ఈ ప్ర‌భుత్వం ఉందంటే ఈ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలి? 

మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో చ‌ర్చ‌కు సిద్ధ‌మే 
కార్తీక‌ వ‌న సమారాధ‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి ఒక త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి  చేసే ప్ర‌య‌త్నం చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే శెట్టిబ‌లిజ‌ల‌ను గౌడ కులంలో చేర్చిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌చారం చేస్తే, అదంతా త‌ప్ప‌ని జీవోల సాక్షిగా నేను రుజువు చేయ‌డం జ‌రిగింది. శెట్టిబలిజ, గౌడ ఉప కులాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ 1997లో చంద్రబాబు హయాంలో జీవో నంబరు 16 విడుదల చేస్తే దానిపై శెట్టిబలిజల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. దీంతో చంద్రబాబుతో స‌హా ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలన్నీ జీవోను ప‌క్క‌న పెట్టేశాయి. కానీ కూటమి ప్రభుత్వం వ‌చ్చాక 2025 జూలై 30 నుంచి మ‌ళ్లీ అమలు చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చి వైయ‌స్ఆర్‌సీపీపై మంత్రి సుభాష్ వైయ‌స్ఆర్‌సీపీ మీద దుష్ప్రచారం మొద‌లుపెట్టారు. దీనిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని మంత్రికి స‌వాల్ చేయ‌డం జ‌రిగింది. దానికి చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని మంత్రి స‌మాధానం చెప్ప‌కుండా చ‌ర్చ‌కు రండి అన్న‌ట్టుగా ఈనాడులో రాశారు. అయినా స‌రే, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరిన‌ట్టుగా మీడియా స‌మ‌క్షంలో చ‌ర్చ‌కు నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఎక్క‌డ చ‌ర్చ‌కు రావాలో వేదిక‌ను నిర్ణ‌యించాలి. మంత్రి అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని నేను చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబడి ఉన్నాను. ఆయ‌న కూడా క‌ట్టుబ‌డి ఉన్నారో లేదో స్ప‌ష్టం చేయాలి. చ‌ర్చలో త‌న ఆరోప‌ణ‌లు అబ‌ద్ధ‌మ‌ని తేలితే శెట్టి బ‌లిజ కులానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అందుకు ఆయ‌న సిద్ధ‌మో కాదో చెప్పాలి.

Back to Top