టీడీపీ వర్ల రామయ్యపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు

తాడేపల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు 
 

తాడేప‌ల్లి:  టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య‌పై పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌లో వైయ‌స్ జ‌గ‌న్ గారిని చూడ‌టానికి వ‌చ్చిన‌ ఒక వ్య‌క్తి ప్ర‌ద‌ర్శించిన ప్ల‌కార్డును, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామయ్య ప్రెస్‌మీట్‌లో చూపిస్తూ.. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ గారి ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు తాడేప‌ల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 20న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు సీబీఐ కోర్టు ముందు హాజ‌ర‌య్యేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సంద‌ర్భంగా ఆయ‌న్ను చూసేందుకు వేల సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. అందులో ఒక వ్య‌క్తి  ప్ర‌ద‌ర్శించిన ప్ల‌కార్డు గురించి తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య ప్రెస్‌మీట్ పెట్టి పార్టీకి త‌ప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారంటూ, అభిమానులు, కార్య‌క‌ర్త‌ల వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను పార్టీ నిర్ణ‌యాలుగా ప్ర‌జ‌ల్లో రుద్దడమే ల‌క్ష్యంగా వైయ‌స్ జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంత‌టితో ఆగ‌కుండా వ‌ర్ల రామ‌య్య మాట్లాడిన వీడియోల‌ను క‌ట్ చేసి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గన్ గారి వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌లో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఉద్దేశ‌పూర్వ‌కంగా దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టింద‌ని, దీన్ని వెంట‌నే అరిక‌ట్టాల‌ని పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడంతోపాటు స‌మాజంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడిన టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య‌పై బీఎన్‌ఎస్‌ సెక్ష‌న్ ల కింద కేసు న‌మోదు చేసి చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ‌ర్ల రామ‌య్య విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో కూడిన వీడియో ఫుటేజ్‌ను ఫిర్యాదు కాపీతోపాటు పోలీసుల‌కు అంద‌జేశారు.

Back to Top