విజయవాడ: సామాజిక న్యాయ స్మృతి పేరుతో విజయవాడ నడిబొడ్డున మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ పరిసర ప్రాంతాలను కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం నాశనం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26 లోపు ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దకపోతే ఆత్మార్పణం చేసుకుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజేఆర్ సుధాకర్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అంబేడ్కర్ విగ్రహాన్ని, పార్కును పరిశీలించారు. పార్కులోని మొక్కలు చనిపోయాయని, ఫౌంటెయిన్‌లు పనిచేయడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ అపరిశుభ్రంగా చెత్తతో నిండి ఉన్న పరిసరాలను శుభ్రం చేసి నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ నిర్మించారన్న కోపంతో ఈ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పార్టీ నాయకులు మండిపడ్డారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలన్న మహోన్నత లక్ష్యంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, చంద్రబాబు కుల దురహంకారంతో ఆలనాపాలనా పట్టించుకోకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని వివరించారు. కులమతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన దార్శనికుడిగానే అంబేడ్కర్‌ని చూడాలని చంద్రబాబుకి హితవు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, ఇతర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● చంద్రబాబుకి అంబేడ్కర్ ను చూసే ధైర్యం లేదు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వైయస్ఆర్‌సీపీ హయాంలో విజయవాడ నడిబొడ్డున నాటి సీఎం వైయస్ జగన్ స్వరాజ్ మైదాన్‌లో దాదాపు 20 ఎకరాల్లో సుమారు రూ.297.71 కోట్లతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల స్మృతి చిహ్నంతోపాటు నిర్మించిన అంబేడ్కర్ మ్యూజియం, పార్కును నిర్మించారు. ఎంతో మహోన్నత ఆశయంతో నిర్మించిన అద్భుత ప్రాంగణం అసలు లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. అంబేడ్కర్ చరిత్రను భావితరాలు తెలుసుకునేలా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు కూటమి ప్రభుత్వం పదును పెట్టింది. నగరం నడిబొడ్డున ఠీవీగా నిల్చున్న అంబేడ్కర్ ని చంద్రబాబు చూడలేకపోతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను చూడటానికి రావొద్దు అనేవిధంగా పార్కు పరిసరాలను ఒక పథకం ప్రకారం నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శుభ్రం చేసి నిరసన తెలిపాం. ● అంబేడ్కర్‌ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది - మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్ రావు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి మాత్రమే కాదు.. ఆయన గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా. కులమతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన దార్శనికుడు. ఈ దేశం ఆయనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా భవిష్యత్తుతరాలు ఎప్పటికీ రుణపడి ఉండేలా అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థను మనకు అందించారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కీర్తిస్తూ అక్కడ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తుంటే, మన దేశానికి ఎంతోసేవ చేసిన మహానీయుడిని చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. దేశంలోనే ఎంతో గొప్పగా నిలిచిపోయేలా అంబేడ్కర్ స్మృతి చిహ్నాన్ని నాటి సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైయస్ జగన్ మీద ఉన్న కోపాన్ని అంబేడ్కర్ స్మృతి వనం మీద చూపించడం దుర్మార్గం. అంబేడ్కర్‌ని గౌరవించుకోవడం అంటే మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. లేదంటే వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా పరిగణించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ● కుల వివక్షతోనే నిర్లక్ష్యం చేస్తున్నారు - విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి నాటి సీఎం వైయస్ జగన్ ఎంతో మహోన్నత లక్ష్యంతో నిర్మించిన అంబేడ్కర్ న్యాయ స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వస్తోంది. పార్కు నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఫౌంటెయిన్‌లు పనిచేయకపోయినా పట్టించుకోవడం లేదు. విగ్రహంపై అక్కడక్కడా రంగులు వెలిసిపోతున్నా పట్టించుకోవడం లేదు. కులవివక్ష మీద పోరాటం చేసిన మహనీయుడిని, స్మృతి చిహ్నాన్ని పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి కులవివక్ష ఉందేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎంతోమంది పర్యాటకులు వచ్చి సందర్శించి వెళ్లేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో వచ్చేవారు తగ్గిపోయారు. ఇప్పటికైనా పునర్‌వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ● అధికారంలోకి వస్తూనే ధ్వంసం చేశారు - ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గొప్పతనం భావితరాలకు తెలియజెప్పాలనే అత్యున్నత ఆశయంతో వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ మహా న్యాయ శిల్పం, స్మృతి వనాన్ని నిర్మించారు. దీంతోపాటు ఆయన జీవిత చరిత్రను తెలిపేలా మ్యూజియం, ఆడిటోరియం ఏర్పాటు చేశారు. సందర్శకలు సేదతీరడానికి అందంగా విశాలమైన పార్కును తీర్చిదిద్దారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ మీద ఉన్న కోపంతో ఈ పార్కును నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఆడిటోరియంపై ఉన్న పేర్లను పగలగొట్టారు. పార్కులో ఉన్న మొక్కల నిర్వహణ గాలికొదిలేశారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం మానేశారు. అంబేడ్కర్ ప్రాంగణం పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి శుభ్రం చేసి నిరసన తెలిపాం. ● దళితులందరికీ అంబేడ్కర్ దేవుడు - పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజేఆర్ సుధాకర్ బాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో "సామాజిక న్యాయ స్మృతి" పేరుతో నిర్మించిన "డా.బిఆర్.అంబేడ్కర్" విగ్రహాన్ని, పరిసర ప్రాంతాలను పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ ప్రాంగణాన్ని పరిశీలించాం. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేడ్కర్ విగ్రహం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. దేశంలోని దళితులంతా దేవుడిగా పూజించే అంబేడ్కర్ విగ్రహం పట్ల వారు చూపుతున్న నిర్లక్ష్యం దళితులను కూడా అవమానించడంగానే భావిస్తాం. దళిత వ్యతిరేక భావజాలంతో చేసే ఇలాంటి చర్యలను వైయస్ఆర్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లో సహించదు. వైయస్ జగన్ మీద కోపంతో అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని హడావుడి చేసి మాటతప్పితే, వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక చేసి చూపించారు. ఆ అక్కసుతోనే ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారు. విజయవాడ నగరానికే కీర్తికిరీటంగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం ఆలనాపాలనా పట్టించుకోకుండా వదిలేస్తే సహించేది లేదు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంలోపు ఈ అంబేడ్కర్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దకపోతే ఇదే ప్రాంగణంలో నిలబడి ఆత్మార్పణ చేసుకోవడానికైనా మేము సిద్ధం. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదు.