కోడుమూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కోడుమూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం మండల కేంద్రంలో రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొని నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జూన్ 12న భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోడుమూరులోని కోట్ల సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా వైయస్ఆర్‌సీపీ నిలుస్తుందని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.