రామచంద్రపురంలో వైయ‌స్ఆర్‌సీపీ రిలే నిరాహార దీక్షలు  

రామచంద్రపురం : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం పట్టణంలో కాజులూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి.

రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌కు సంబంధించి వెలుగులోకి వస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని, డీఎస్సీ బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం హామీలను అమలు చేసే వరకు తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
 

Back to Top