ఇండస్ ఆస్ప‌త్రి ఘ‌టనపై సమగ్ర విచారణకు ఆదేశించాం

వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌

బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశం

విశాఖపట్నం: న‌గ‌రంలోని ఇండస్ ఆస్ప‌త్రిలో గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై స‌మ‌గ్ర విచారణకు ఆదేశించామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.   ప్రమాద స‌మాచారాన్ని తెలుసుకొని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఆస్ప‌త్రికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అగ్ని ప్రమాదం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన వారిని, అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఆస్ప‌త్రిలో ఉన్న రోగుల వివరాలను వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం వల్ల 46 మంది అస్వస్థతకు గురయ్యారని, వారిని కేజీహెచ్ విజేత, మెడికవర్ ఆస్ప‌త్రుల‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరిలో 20 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యార‌న్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జ‌రిగిన‌ట్లు ప్రాథమిక సమాచారం అందింద‌న్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్ప‌త్రి యాజమాన్యానికి సూచించామ‌న్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. 

Back to Top