విజయవాడ : ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులకు 30 నెలలుగా గౌరవవేతనాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజను కలిసి వినతిపత్రం అందజేశారు. పదవీకాలం ముగుస్తున్నా గౌరవవేతనాలు, వాహన బకాయిలు, అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉంచడం స్థానిక సంస్థలను ఆర్థికంగా బలహీనపరచడమేనని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేసి పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధులకు గౌరవవేతనాలు ఎక్కడ? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు 30 నెలలుగా గౌరవవేతనాలు అందకపోవడం దారుణమని వెన్నపూస రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులకు వాహన బకాయిలు కూడా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. గతంలో పదవీ విరమణ చేసిన సర్పంచులు, ప్రస్తుత ఎంపీపీలు, జడ్పీటీసీలు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖపై పవన్‌కల్యాణ్ దృష్టి పెట్టాలి పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్థానిక సంస్థల సమస్యలపై దృష్టి పెట్టాలని రవీంద్రారెడ్డి కోరారు. “ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులకు నెలల తరబడి గౌరవవేతనాలు అందకపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతూ ప్రజాప్రతినిధుల సమస్యలను పట్టించుకోకపోవడం ఏమిటి?” అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వాస్తవ సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. నాగబాబుకు రూ.4 లక్షలకు పైగా.. ప్రజాప్రతినిధులకు ఎందుకు లేవు? నాగబాబుకు పదవి ఇచ్చి నెలకు రూ.4 లక్షలకు పైగా పారితోషికం అందిస్తుంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లకు 30 నెలలుగా గౌరవవేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. “ప్రజాప్రతినిధులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే పెండింగ్ గౌరవవేతనాలను విడుదల చేయాలి” అని కోరారు. 16వ ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకే 16వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించకుండా స్థానిక సంస్థలకు అందించాలని రవీంద్రారెడ్డి కోరారు. గ్రామాల అభివృద్ధితో పాటు పెండింగ్ గౌరవవేతనాలు, వాహన బకాయిలు, అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు నిధులు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లు వి. తిరుపతిరావు, డి. వీరయ్య, ఉపాధ్యక్షుడు జె. రామ్‌మూర్తి, జిల్లా అధ్యక్షులు డి. రాజు, ఎస్. వెంకటేశ్వర్‌రావుతో పాటు పలువురు పంచాయతీరాజ్ విభాగం నాయకులు పాల్గొన్నారు.