కుప్పంలో కూటమి సర్కార్‌కు స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూటమి ప్రభుత్వానికి పరాభవం తప్పదని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ భరత్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు హఫీజ్‌, మోహన్‌రావు, శివకుమార్‌, రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని, రైతుల ఆత్మహత్యలను తన మంత్రులతో అవహేళన చేయించిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని పేర్కొన్నారు.

మదనపల్లి సభలో కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన చంద్రబాబు, కరువు ప్రాంతాల్లో ఉద్యానవన రంగంపై ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సైతం ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. పదేపదే హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Back to Top