పాడేరు: వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాడేరు జిల్లా కేంద్రంలో చేపట్టిన నాలుగో రోజు ధర్నాకు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మద్దతు తెలిపారు. ధర్నా శిబిరానికి వెళ్లి ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి వైయస్ఆర్‌సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. రేపటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొంటామని వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.