విశాఖపట్నం: విశాఖ పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆందోళన బాట పట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న పోర్టు కాలుష్య సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగదాంబ జంక్షన్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నాయకత్వం వహించారు. పోర్టు కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక థీమ్‌తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. నిరసనలో భాగంగా జగదాంబ జంక్షన్ నుంచి పూర్ణా మార్కెట్ వరకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మోకాళ్లపై యాత్ర చేపట్టారు. విశాఖ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పోర్టు కాలుష్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే ప్రజల తరఫున వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.