తాడేపల్లి: నార్వే చెస్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ చాంపియన్, భారత చెస్ సంచలనం డి గుకేష్.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించడంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్ల్‌సన్‌ను ఓడించడంపై గుకేష్‌కు ఆయన అభినందనలు తెలిపారు. కేవలం 62 మూవ్‌లతోనే కార్లసన్‌ను మట్టికరిపించడంపై ప్రత్యేకంగా ప్రస్తావించిన వైయస్ జగన్.. గుకేష్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గుకేష్ గెలిచిన ఆనంద క్షణాల్ని వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రపంచ చాంపియన్ కార్లసన్‌తో జరిగిన ఆరో రౌండ్ పోరులో భారత చెస్ యువ కెరటం అనూహ్య విజయాన్ని సాధించాడు. క్లాసికల్ గేమ్‌లో గుకేష్ కార్ల్‌సెన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి. దీంతో గుకేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోతే, కార్ల్‌సన్‌కు మాత్రం అసహనం కట్టలు తెంచుకుంది. కార్ల్‌సెన్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ బల్లపై బలంగా కొట్టాడు.