దామినేడులో రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు హోటల్‌కు కట్టబెట్టారా?

రూ.19 కోట్లకే విలువైన భూమిని అప్పగించడం వెనుక మతలబేంటి?

ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని అంగీకరించం

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: తిరుచానూరు సమీపంలోని దామినేడులో ప్రభుత్వ విలువ ప్రకారమే సుమారు రూ.600 కోట్ల విలువైన భూమిని అత్యంత తక్కువ ధరకు ప్రైవేటు స్టార్ హోటల్‌కు కట్టబెట్టారని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. మార్కెట్ విలువ ప్రకారం అత్యంత విలువైన ఈ భూమిని ఫ్రీహోల్డ్ పేరుతో ఎకరా రూ.90 లక్షల చొప్పున సుమారు రూ.19 కోట్లకే అప్పగించడం వెనుక కారణాలేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ.600 కోట్ల భూమిని రూ.19 కోట్లకే ఎలా ఇస్తారు?

దామినేడు ప్రాంతంలో ప్రతి మూడు నెలలకు భూముల ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఈ భూమి విలువ రూ.3 వేల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని భూమన పేర్కొన్నారు. ఇంత విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్‌కు చెందిన సైబర్ సిటీ హోల్డింగ్స్, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ సంస్థలకు అత్యంత తక్కువ ధరకు అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్‌కు రూ.150 కోట్లు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు రూ.50 కోట్ల ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు.

దళితులు సాగు చేస్తున్న భూమిని హోటల్‌కు ఇస్తారా?

ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ప్రైవేటు హోటల్ నిర్మాణానికి అప్పగించడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరుకు కూతవేటు దూరంలో మసాజ్ సెంటర్, స్పా, సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రైవేటు హోటల్‌కు ప్రభుత్వ రాయితీలు ఎందుకు?

తిరుపతి నగరంలో ఇప్పటికే సుమారు 5,500 హోమ్ స్టేలు, అనేక స్టార్ హోటళ్లు ఉన్నాయని భూమన పేర్కొన్నారు. వాటి నిర్వాహకులు ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు మాత్రం ఒక ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు సహా ఇతర సౌకర్యాల్లో రాయితీలు కల్పిస్తూ జీవో ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తే ఊరుకోం

ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్ కోసం శ్రీవారి ఆలయానికి సంబంధించిన స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా బదలాయించిందని భూమన ఆరోపించారు. ‘‘ఇలాంటి నిర్ణయాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విలువైన ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని అంగీకరించం. జిల్లా కలెక్టర్ కార్యాలయమే టీటీడీ స్థలంలో కొనసాగుతున్నప్పుడు, అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. డీఎస్సీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.

Back to Top