సేంద్రియ సాగు అభిలషణీయమే గాని..

అందరికీ అలా తిండిగింజలు సరఫరా సాధ్యమయ్యే పనికాదంటున్న నిపుణులు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌త్యేక క‌థ‌నం

అమ‌రావ‌తి:  పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి హాని జరగకుండా నివారించడానికి సేంద్రియ వ్యవసాయం చక్కటి మార్గమనే ప్రచారం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ప్రపంచ ప్రజలందరికీ సేంద్రియ సాగు పద్ధతుల ద్వారా ఆహారధాన్యాలు పండించి సరఫరా చేయడమే అత్యుత్తమ పరిష్కారమనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిన నేపథ్యంలోనే గాక, సేంద్రియ వ్యవసాయం విస్తరణ, ఇందులో సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కొన్ని వాస్తవాలు కనిపిస్తాయి. జనసంఖ్య 140 కోట్లు దాటిన ఇండియాలో ఇప్పుడిప్పుడే సేంద్రియ సాగు నెమ్మది నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ తరహా సాగు విస్తీర్ణం కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా తిండిగింజలను పండించి కనీసం నాలుగో వంతు భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సమీప భవిష్యత్తులో జరిగే పనికాదని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు సేంద్రియ సాగు అంటే ఏమిటో మొదట తెలుసుకుందాం. కృత్రిమ పురుగుమందులు, రసాయన ఎరువులు వాడకుండా ఆహారధాన్యాలు పండించడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. జన్యుపరమైన మార్పులతో రూపొందించిన మొక్కలను కూడా ఈ సేంద్రియ సాగులో ఉపయోగించరు. ప్రకృతిసిద్ధమైన ఎరువులు, క్రిమిసంహారకాల ద్వారా తిండిగింజలు, ఆహార ధాన్యాలు, కూరగాయల సాగు కొనసాగుతుంది. ఈ పద్ధతి వల్ల నేల నాణ్యత బావుంటుంది. ఇలా రసాయనాల అవశేషాలు ఆహార పదర్ధాల్లోకి రాకుండా నివారించవచ్చు. కాని, సేంద్రియ వ్యవసాయంలో భారీ దిగుబడులు ఇంకా సాధ్యం కావడం లేదు. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో సేంద్రియ వ్యవసాయం వాటా చాలా తక్కువ. ప్రజలందరికీ సేంద్రియ ఆహారం అందించడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఈ తరహా సాగు పరిమిత పరిణామంలోనే సాగుతుందని, ఇది ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 

ఐరోపా దేశాల్లో తగ్గుతున్న సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణం! 
బాగా పారిశ్రామికీకరణ  లేదా యాంత్రీకరణజరిగిన వ్యవసాయ పద్ధతులున్న పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అతి స్వల్ప స్థాయిలో సేంద్రియ వ్యవసాయం సాధ్యమౌతుందని ఐరోపా దేశాల అనుభవాలు చెబుతున్నాయి. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు లేకుండా చేసే ఈ తరహా సాగులో దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉండవు. సేంద్రియ సాగు రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలు వసూలు చేయడం ద్వారా గిట్టుబాటు అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలు సేంద్రియ ఆహార ఉత్పత్తులకు ఎక్కువ ధరలు చెల్లించడానికి ఇష్టపడని కారణంగా సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం అతి స్వల్ప స్థాయిలో ఉంది. ఇక కూరగాయలు, పళ్లు, ఇతర ఆహార పంటల సేంద్రియ సాగు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతోంది. కొన్నేళ్ల క్రితం సేంద్రియ పంటలపై వ్యక్తమైన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. అభివృద్ధిచెందిన ఐరోపా దేశమైన ఫ్రాన్స్‌ లో సేంద్రియ సాగు విస్తీర్ణం వాటా 2021 వరకూ 13.5% వరకూ పెరిగింది. ఇటీవల ఈ దేశంలో సేంద్రియ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఇతర ఐరోపా దేశాల్లో సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం బాగా తగ్గిపోతోంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ సంపాదించిన అనుభవాన్ని బట్టి చూస్తే..ఇండియా సహా అనేక దేశాల వాతావరణ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం విస్తరించడం, ఇందులో దిగుబడులు అభిలషణీయ స్థాయిలో సాధించడం కుదిరే పని కాదని తాజా కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేసి, రిటెయిల్‌ మార్కెట్ల ద్వారా వినియోగదారులకు అందించే నాంధారీ గ్రూప్‌ సీఈఓ గురుముఖ్‌ రూప్రా ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘సేంద్రియ సాగు స్థిరంగా లేదా నిలకడగా చేయడం సాధ్యం కాదు. ఈ రంగంలో తక్కువ దిగుబడులు, అధిక ధరల కారణంగా దీర్ఘకాలంలో సేంద్రయ సాగు పద్ధతులు కొనసాగించడం కుదరదని భావిస్తున్నాను,’ అని రూప్రా అన్నారు. అదీగాక సేంద్రియ పద్ధతిలో పండించామని చెప్పే టమోటాలు, మిరపకాయలను పరీక్షించి అది నిజమేనని నిర్ధారించే పరీక్షా పద్ధతులు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, కొంత వరకు రసాయన అవశేషాలు ఉండని ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్ల సాగు కోసం రైతులు ప్రయత్నించడం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Back to Top