మచిలీపట్నం: తాను దేవుడి భూములు కొట్టేశానంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... గొల్లపూడి దేవుడి భూముల్లో అధికార పార్టీ నేతల అవినీతి బాగోతాన్ని బయటపెట్టానన్న దుగ్దతో... తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలమీద సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐ విచారణ కు తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో డీజిల్ మాఫియా సహా పలు అక్రమాలకు మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బిందువని ఆయన చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తి అది.. మచిలీపట్నంలో గొర్రిపాటి గోపీచంద్ తెరవెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారు. మాచవరం బైపాస్ రోడ్డులో దేవుడి ఆస్తిని లింగం ఆనంద్ అనే బినామీ పేరుతో దోచుకున్నానని ఆరోపించారు. అదే విధంగా 2005లో నా భార్య పేరు మీద 500 గజాలు, ఆమె తండ్రి పేరు మీద మరో 500 గజాలు దేవుడి ఆస్తి దోచుకున్నానని ఆరోపించారు. కనీస సాక్ష్యాధారాలు కూడా పరిశీలించకుండా నా మీద విషం చిమ్మారు. మాచవరంలో విశ్వేశ్వరస్వామి వారికి 7.50 ఎకరాలు, దానికి ఆనుకుని శ్రీరంగనాయకస్వామి వారి ఆస్తి సుమారు 8 ఎకరాలు ఉంటాయి. నేను ఈ ఆస్తి కొట్టేశానని.. బందరులో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మాట్లాడారు. బందరులో విశ్వేశ్వరస్వామి వారికి 7.50 ఎకరాల భూమి ఉంటే అందులో 3 ఎకరాలు పై ఒకటి, 50 సెంట్లు పై మరొకటి మొత్తం రెండు కేసులు నమోదు కావడంతో ఈ వివాదం కోర్టులో ఉంది.అప్పటి ఎండోమెంట్స్ అధికారులు ... ఆక్రమణలు, కోర్టు కేసులు వల్ల ఈ భూమి వేలం వేస్తున్నామని చెప్పారు. ఆ సందర్భంలో విశ్వేశ్వరస్వామికి చెందిన 7 ఎకరాల భూమి వేలం వేస్తే.. అందులో దాదాపు వంద మందికి వరకు పాల్గొన్నారు. ఈ వేలంలో సూర్య అండ్ సన్స్ బాబు తరపున పంచకర్ల రమేష్, రమణి, మిరియాల కుటుంబీకులు పాడుకున్నారు. మరోవైపు 2006లో రంగనాయకస్వామి భూమి కూడా బహిరంగ వేలానికి వస్తే... ఈ వేలం పాటను అప్పటి దేవాదాయశాఖ ఆర్జేసీ నిర్వహిస్తే... ఈ వేలంలో లింగం రమణమూర్తి రెండు ఎకరాలు, గూడూరుకి చెందిన సంగా మధుసూదనరావు అండ్ పార్టీ మరో 2 ఎకరాలు, మేకల సుబ్బారావుగారి కుటుంబం 1.33 ఎకరాలు పాడుకున్నారు. దేవాదాయాశాఖలో మిగిలిన అధికార్లు ఇప్పటికీ శాఖలో ఉన్నారు. 2006లో ఈ వేలం జరిగితే 2011లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వేలం పాడుకున్న మూడు పార్టీల వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది వాస్తవం కాగా... షాడో మంత్రి గారు ప్రెస్ మీట్ లో దేవుడు ఆస్తులు కొట్టేశారని ఆరోపిస్తూ... నా భార్య, మామయ్య పేరుతో డాక్యుమెంట్లు చూపించారు. వాస్తవానికి ఆ దేవాదాయ భూములు 2006లో వేలం వేయగా... 2011లో సేల్ కన్ఫర్మేషన్ తర్వాత మూడు పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి దగ్గర నుంచి 2022లో మేం ఇద్దరి పేరు మీద 1000 గజాలు కొనుగోలు చేశాం. మేం సక్రమంగా అన్ని అనుమతులుతో కొనుక్కుంటే కూడా దొచుకున్నామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ● నా మీద అవినీతి ముద్రకు విశ్వప్రయత్నాలు... 2024లో మచిలీపట్నంలో మేం ఓడిపోయిన వెంటనే కొల్లు రవీంద్ర అనుంగ అనుచరుడు బాలాజీ, గోపీచంద్ సన్నిహితుడు దిలీప్ ఇద్దరూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నా కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు నాతో రాజకీయంగా ఉంటున్న 70 సహచరుల ఆస్తుల డాక్యుమెంట్టను తీసుకున్నారు. అదే విధంగా 2024లో నా ఐటీ రిటర్న్స్ కూడా తీసుకున్నారు. వీటన్నింటినీ ఢిల్లీ తీసుకుని వెళ్లి ఓ ఎంపీ సహాయంతో అక్కడ ఆదాయపుపన్నుశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈడీకి కూడా దిలీప్ అనే వ్యక్తితో పిటిషన్ పెట్టించారు. పేర్ని నాని అనే నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించి జైల్లో వేయాలన్న కాంక్షతోనే ఈ మొత్తం తతంగాన్ని నడిపించారు. విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేశారు. ఇన్ని విచారణలు నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా తో కలిసి తిరిగిన వారి మీద చేసినా ఏం దొరక్కపోవడంతో ఇప్పుడు నేను దేవుడి ఆస్తిని దోచుకున్నానని కొత్తగా ఆరోపణలకు దిగారు. ఎన్నికలు అయిన వెంటనే ఎందుకు మాట్లాడలేదు అంటే... దానికి చాలా పెద్ద కారణం ఉంది. ● మీ అక్రమాలు బయటపెట్టడంతో ఉలికిపాటు... గొల్లపూడిలో 40 ఎకరాలు దేవుడి ఆస్తి వేలానికి సంబంధించి.. మీ తప్పుడు ఆలోచనలు బట్టబయలు చేశానన్న దుగ్ధతో నా మీద తిరిగి ఆరోపణలకు దిగారు. 2017లోనే తెలుగుదేశం నాయకులు ఈ భూమిపై కన్నేసి... వాటిని కనకదుర్గమ్మకు దత్తత ఇచ్చారు. విజయవాడ వేదికగా దుర్గగుడి ఈవో ద్వారా ఈ భూములను కాజేయాలన్న దురాలోచనతోనే ఈ పథకం వేశారు. ఈ గుడి అత్యంత దుర్భరస్ధితిలో ఉంది. దాని గురించి పట్టించుకోని కొల్లు రవీంద్ర గారు.. ఇప్పుడు ఆ భూములు కాజేయాలన్న దురుద్దేశంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్.జగన్ గారితో మాట్లాడి ఆ గుడిని దుర్గగుడి నుంచి డీ ఆడాప్షన్ చేయించి.. రూ.2 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఈ మొత్తంలో 10 శాతం భక్తుల విరాళాల రూపంలో ఇవ్వాల్సి ఉంటే.. నా కుటుంబం రూ.1లక్ష విరాళం ఇచ్చింది. మొత్తం రూ.18 లక్షలు వసూలు చేశాం. మరికొంతమంది వస్తు రూపేణా సాయం చేశారు. ఆ విధంగా ఆలయ నిర్మాణం కూడా పూర్తైంది. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 కోట్ల ఖరీదు చేసే దేవుడి భూమిని ఇప్పుడు 99 ఏళ్ల లీజుకు కలెక్టర్ లక్ష్మీషా కేటాయించారు. అక్కడ 5 ఎకరాల్లో ప్రపంచస్ధాయి గోల్ఫ్ కోర్టు నిర్మిస్తామని చెబుతున్నారు. అంటే గోల్ఫ్ కోర్టు సాకుతో విజయవాడ క్లబ్ తరహాలో పేకాట క్లబ్బు పెట్టాలన్నది మీ ఆలోచన. ఈ క్లబ్ లో సభ్యత్వం స్విమ్మింగ్ పూల్, బార్ అన్ని సౌకర్యాలుంటాయి, రూ.15-20 లక్షలతో క్లబ్ మెంబర్షిప్ ఇస్తామని కొల్లు రవీంద్ర గారి మనుషులు తిరుగుతున్నారు. మరో 35 ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని ప్రైవేటు వ్యక్తులు చెబితే కలెక్టర్ గారు ఏ విధంగా రికమెండ్ చేస్తారు ? నారా లోకేష్ రెడ్ బుక్ పరిపాలనలో చివరకు ఐఏఎస్ అధికారులు కూడా ప్రయివేటు వ్యక్తుల కోసం భయపడి లేఖ రాస్తారా? ● జాతర పేరుతో దోపిడీ.. టీడీపీ నాయకులు బెజవాడలో డయేరియాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరామర్శకు పోలేదు. గుంటూరు జిల్లాలో తురకపాలెంలో ప్రజలు చనిపోతున్నా వెళ్లలేదు కానీ బోసిడీకె పట్టాభి లాండి వాళ్లు ఇక్కడికి వచ్చి గుళ్లూ, గోపురాలు తిరగడానికి మాత్రం టైం ఉంటుంది. కొల్లు రవీంద్రగారు ఇప్పటికి మూడు దఫాలు గొల్లపూడి గుడికి వెళ్లారు. ఇప్పటివరకు రూ.3-4 కోట్ల విలువ చేసే మట్టితో దేవుడి భూమిని మెరక చేశారు. దీనిపై దేవుడి ఆస్తిని కాపాడాలంటూ... ఎండోమెండ్ కమిషన్ గారు జిల్లా కలెక్టర్ కి లేఖ రాశారు. ఇంతకన్నా రెడ్ బుక్ రాజ్యాంగం, పాపం ఉంటుందా? ఈ మట్టి ఎక్కడిదో, ఎవరు తోలారో తేల్చాల్సిన బాధ్యత మీకు లేదా కొల్లు రవీంద్రగారూ ? మరోవైపు దేవుడి భూములు దగ్గరకు వచ్చిన పట్టాభి మాట్లాడుతూ కౌలుదారులకు రూ.15 లక్షలు ఇచ్చాం, కౌలుదారులకు రూ.45 లక్షలు ఇస్తున్నామని చెబుతున్నాడు. ఈ రూ.65 లక్షలు ఎవరి అకౌంట్ లో డబ్బులు ? మట్టి తోలడానికి మరో రూ. 3-4 కోట్లు ఖర్చు ఎక్కడ నుంచి తెచ్చారు? దేవుడికి ఆదాయం వస్తుంది కదా అంటున్నారు. ఏ రూపంలో ఆదాయం వస్తుందని అడుగుతున్నాం. పేకాట క్లబ్బులా, మాంసం, మద్యం దుకాణాలు పెడుతున్నారా? 2025లో చంద్రబాబు నాయుడు దేవాదాయశాఖ ద్వారా ఇచ్చిన ఆదేశాల్లో .. విద్య, వైద్యం, ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా సేవలు చేసే వాళ్లకు నామినేషన్ విధానంలో ఉచితంగా దేవుడి ఆస్తులు ఇవ్వొచ్చని చెప్పారు. మరి ఎండోమెంట్ కమిషనర్ కి జీవోలు, చట్టాలు, హైకోర్టు తీర్పులు పట్టవా? దీనికి కొల్లు రవీంద్ర, ఎంపీ, కలెక్టర్ అందరూ సమాధానం చెప్పాలి. ఎండోమెంట్ చట్టం ప్రకారం దేవుడి ఆస్తులను వేలం ద్వారా తప్ప నామినేషన్ విధానంలో ఇవ్వకూడదని స్పష్టం చేస్తోంది. అవన్నీ తుంగలో తొక్కారు. 56 రోజుల్లో సుమారు రూ.4 కోట్లు ఖర్చు పెట్టారంటే... మీకు ఎంత ఆదాయంవస్తుంది. ఏం చేస్తే వస్తుంది. హిందూ దేవాలయాల ఆస్తిని, ఉద్యోగాలను అన్యమతస్థులకు ఇవ్వకూడదు అని నిబంధన ఉంది. అలాంటప్పుడు నాన్ వెజ్ రెస్టారెంట్లకు, బార్ షాపులకు ఇవ్వొచ్చా? ఉత్సవాల పేరుతో మీరు 30 ఎకరాల దేవుడి భూమిలో 3-4 అడుగుల మేర కప్పిన మట్టిని ఎవరు తొలగిస్తారు? అది మరలా వ్యవసాయానికి పనికి వస్తుందా? అంటే భవిష్యత్తులో కూడా మీరు తప్ప మరొకరు కౌలుకు తీసుకునే వీలు లేదు. ప్రభుత్వ అండదండలు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ముందు మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఏడాదికి రూ.500 చొప్పున 99 ఏళ్లకు లీజుకు తీసుకోవాలనుకున్నారు. మీడియా మీ బాగోతం బట్టబయలు చేయడంతో తేలుకుట్టిని దొంగల్లా ఈ 56 రోజుల ఉత్సవాలను తెరపైకి తెచ్చారు. 56 రోజులకే రూ.45 లక్షలు వస్తే.. మిగిలిన రోజులకి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందేమో కదా? ఎందుకు వేలం పెట్టడం లేదు ? బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలకు పోటీగా ఇక్కడ ఉత్సవాలా? ● నాపై ఏ విచారణకైనా సిద్దం బందరు ప్రజలు, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలను ప్రశ్నిస్తున్నాను. నేను దేవుడు ఆస్తిని కొట్టేశానని చెబుతున్నగోపీచంద్ గారు ..2006లో జరిగిన దేవుడి భూముల వేలంలో ఆయన భార్య రాజేశ్వరమ్మతో సహా వేలంలో పాల్గొన్నారా? లేదా? ఆలయ రికార్డులు తనీఖీకి మీరు సిద్దమా? కేవలం నన్ను అవినీతి పరుడిగా చిత్రీకరించడానికి మీరు 2020 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన చైతన్యరధం పత్రికలో నాకు రూ.5వేల కోట్ల ఆస్తులు, పెద్ద కోట లాంటి ఇళ్లు అని రాశారు. మీరిప్పుడు మైనింగ్ మంత్రి కదా... నా దగ్గర ఎంత మామూల్లు తీసుకుని నా మైన్స్ జోలికి రావడం లేదు రవీంద్రగారూ? నేను బైపాస్ రోడ్డులో వైశ్యుల ఆస్తి ఆక్రమించానని ఆరోపించారు, మరెందుకు నన్ను జైల్లో వేయడం లేదు. నేను దేవుడి ఆస్తిని ఆక్రమించుకుంటే నన్ను అరెస్టు చేయండి. మెడికల్ కాలేజీ, పోర్టుతో పాటు నేను చేసిన అభివృద్ది కార్యాక్రమాలు మీరు చేశామని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పిన దేవాదాయశాఖ భూముల మీద సీబీఐతోనే, హైకోర్టు జడ్జితోనే విచారణ చేయించాలని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. తప్పు చేశానని నిరూపణ అయితే జైల్లో వేయండి. ● కొల్లు రవీంద్ర అక్రమాల చిట్టా.. అధికారంలో లేనప్పుడు మీ రైస్ మిల్లు లీజుకిచ్చి... ఏ దందా కోసం అధికారంలోకి రాగానే మరలా వెనక్కి తీసుకున్నారు. పాతరమణ పేటలో రవీంద్ర అనే వ్యక్తి కి మీరు పదవి ఆశచూపి రూ.5 కోట్లు తీసుకున్నారని మాట్లాడితే... రౌడీలతో కృత్తివెన్నులో తోట నరికించిన మాట వాస్తవం కాదా? తిరిగి వాళ్లందరిపైనా కేసులు పెట్టించిన మాట వాస్తవం కాదా? అది అవినీతి కాదా? సుల్తాన్ నగర్ లో మీ పాత ఫౌండ్రీ దగ్గర ఎకరమున్నర ఎన్ని కోట్లకు కొనుగోలుచేశారు. తాజాగా భారీగా ఖర్చుతో రైస్ మిల్లు ఎలా కడుతున్నారు? వీటికి ప్లాన్, లోన్ ఉన్నాయా ? ఎన్నికల అఫిడివిట్ 2024 ప్రకారం మీ కుటుంబానికి రూ.2 కోట్ల ఆస్తి అని చూపించారు. అలాంటి మీరు తెలుగుదేశం పార్టీకి రూ.1 కోటి చందా ఇచ్చారు. మీరిచ్చిన అఫిడివిట్, ఇన్ కమా టాక్స్ రిటర్న్స్ ప్రకారం రూ.1కోటి చందా ఇచ్చే పరిస్థితి మీకు ఉందా? మార్కెట్ లో మీరు కడుతున్న కాంప్లెక్స్ కు ప్లాన్ ఉందా ? రోడ్డు మీద తోపుడుబండ్లు, కిరాణా దుకాణాల మీద బ్రతుకుతుంటే బందరు అందానికి అడ్డువస్తుందని అన్నీ తొలగిస్తారు. వైయస్ఆర్‌సీపీ కార్యాలయానికి ప్లాన్ లేదని మాట్లాడుతున్నారు... మీరు కడుతున్న వాటికి ప్లాన్ ఎందుకు లేదు ? మీరు బందరులో కోట రోడ్డులో కట్టుకుంటున్న కోటకి ప్లాన్ ఉండదా? మీరు రోజువారీ కూలిపనులు చేసేవాళ్ళ కోసం రూ.2.50 లక్షల కూలీ కింద చెల్లిస్తుంటారని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో 10వేల ఎస్ ఎస్ టి ఆపార్ట్ మెంట్ రెడీ అయిందా రవీంద్రగారూ? గృహప్రవేశం అయిందా? వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా ? వీకెండ్ కు హైదరాబాద్ , రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్లారు? ఎందుకు వెళ్తున్నారు?. మీ పాస్ పోర్టు , వీసా చూపించే దమ్ముందా మీకు? ● కొల్లు రవీంద్ర కనుసన్నల్లో డీజిల్ మాఫియా రాష్ట్రం మొత్తం మీద డీజిల్ ఆయిల్ మాఫియాను నడిపిస్తున్నది కొల్లు రవీంద్రే. డీజీపీ, కమర్షియల్ టాక్స్ కమిషనర్, విజిలెన్స్ కమిషనర్ మీరు విచారణ జరిపించండి. గిలకలదిన్నె వేదికగా డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. 2024 జూలైలో ఈ ఆయిల్ మాఫియా మొదలుపెట్టారు. ఒక్కొక్కటి 40వేల లీటర్ల కెపాసిటీతో ఈ మాఫియా నర్సాపురం ఫిషింగ్ హార్భర్ లో నెలకు 3 నుంచి 4 ట్యాంకర్లు, మచిలీపట్నంలో నెలకు 10 నుంచి 12 ట్యాంకర్లు, చీరాలలో 3 ట్యాంకర్లు, నిజాంపట్నం 15 నుంచి 20, జువ్వలదిన్నెలో 6 నుంచి 7 ట్యాంకర్లు కొల్లు రవీంద్ర నాయకత్వంలో నడిపిస్తున్నాడు. డీజిపి, విజిలెన్స్ , జీఎస్టీ ఎవరూ పట్టించుకోవడం లేదు . ఒక్కో ట్యాంకర్ కు రూ. 5 లక్షలు సంపాదిస్తున్నారు. ప్రతీ చోటా కొల్లురవీంద్రకు ఒక బినామీ ఉన్నారు. మీ సహచర మంత్రే దోపిడీ చేస్తుంటే... రెవెన్యూమంత్రి గారూ మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు ? అని పేర్ని నాని నిలదీశారు.