ప్ర‌భుత్వ ఆస్తుల‌ను బినామీలకు కారుచౌకగా క‌ట్ట‌బెట్టడమేనా చంద్రబాబు విజన్? 

మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 

తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే 

15 నెల‌ల కూట‌మి పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు విధ్వంసం

విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, సాగునీటి రంగాల ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటైజేష‌న్‌తో చరిత్ర హీనుడిగా మిగిలిన చంద్ర‌బాబు 

వైయ‌స్ జ‌గ‌న్ చేసిన మంచిని త‌న‌దిగా చెప్పుకోవ‌డం సిగ్గుచేటు 

వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల‌లో చేసిన అప్పుల‌ను ఏడాదిన్నరలోనే స‌గం దాటేసిన కూట‌మి

అయినా అప్పుల‌పై వైయ‌స్ఆర్‌సీపీపై బుర‌ద జ‌ల్ల‌డం ఆప‌డం లేదు

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చంద్ర‌బాబు అబ‌ద్ధాల‌పై గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్ర‌హం

తాడేప‌ల్లి: దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, అబ‌ద్ధాలు చెప్ప‌డంలో మాత్ర‌మే చంద్ర‌బాబు విజ‌న‌రీ అని వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ల స‌దస్సులో కూడా చంద్ర‌బాబు త‌న గురించి బాకా ఊదుకోవ‌డం ఆప‌డం లేద‌ని, ఆఖ‌రుకి క‌లెక్ట‌ర్ల‌ను కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఉపయోగించుకోవాల‌ని చూడ‌టం సిగ్గుచేటన్నారు. పోర్టులు, మెడిక‌ల్ కాలేజీలు, స‌చివాల‌యాలు, హెల్త్ క్లీనిక్‌ల‌ నిర్మాణంతో నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంప‌ద సృష్టిస్తే, చంద్ర‌బాబు మాత్రం వాటిని ప‌ప్పు బెల్లాల‌కు ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెడుతున్నాడ‌ని శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులను చంద్ర‌బాబు ఏడాది పాల‌న‌లో 50 శాతానికి మించి చేశాడ‌ని, అయినా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని మా పార్టీపై నిందలు మోపుతున్నార‌ని ధ్వజమెత్తారు. మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేసి పేద‌ల‌కు సంజీవ‌ని లాంటి ఆరోగ్య‌శ్రీని నిర్వీర్యం చేసి చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా మిగిలిపోయార‌ని మాజీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...
 
చంద్ర‌బాబు పాల‌న‌లో ఎప్పుడూ శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్యే

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఏ ఒక్క సంక్షేమ ప‌థకాన్ని కానీ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కానీ అమ‌లు చేయ‌లేక‌పోయిన చంద్ర‌బాబు, విజ‌న్ డాక్యుమెంట్‌ల పేరు చెప్పి అబ‌ద్ధాలు, మాయ‌మాట‌ల‌తో ప్ర‌జ‌ల్ని ఇంకా వంచించాల‌ని చూస్తున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జా స‌మ‌స్య‌లు, నిరుద్యోగం, వ్య‌వ‌సాయ సంక్షోభం వంటి అంశాల‌ గురించి ఆలోచించ‌డంలేదు స‌రికదా క‌నీసం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు. క‌లెక్ట‌ర్ల స‌దస్సులో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు స‌హ‌క‌రించ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు నేరుగా చెప్ప‌డం చూస్తుంటే వారి అవినీతి మ‌ర‌క‌ల‌ను క‌లెక్ట‌ర్ల‌కు అంటించాల‌ని చూస్తున్నారు. మ‌రింత బ‌రితెగించేసి తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం గురించి క‌లెక్ట‌ర్ల‌కు సూచ‌న‌లు చేయ‌డం ఆయ‌న దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు ఏమాత్రం పొంత‌న ఉండ‌టం లేదు. 1995 నుంచి 2004 వ‌ర‌కు తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విజ‌న్-2020 పేరు చెప్పి హ‌డావుడి చేసిన చంద్ర‌బాబు వ్య‌వ‌సాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఉమ్మ‌డి రాష్ట్రంలో న‌క్స‌లిజం పెరిగిపోయింది. శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించిపోయాయి. పేద‌ల‌కు క‌నీసం ఇళ్లు కూడా క‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజాన్ని పెంచి పోషించాడు. న‌క్స‌లిజాన్ని అదుపు చేయ‌లేకపోయాడు. చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతంతోనే రాష్ట్రం విడిపోయింది. 2004లో వైయ‌స్ఆర్ సీఎం అయ్యాక‌నే రాష్ట్ర స్థితిగ‌తుల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పులొచ్చాయి. వ్య‌వ‌సాయం, నీటిపారుద‌ల రంగాలను బ‌లోపేతం చేశారు. రాయ‌ల‌సీమను ర‌త‌నాల సీమ‌గా మార్చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులోకి వ‌చ్చాయి. విద్య‌, వైద్యం, సంక్షేమం, సాగునీరు, వ్య‌వ‌సాయం రంగాల‌ను బ‌లోపేతం చేశారు. ఐదేళ్ల‌లోనే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని హరితాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. 

అప్పుల‌పై ఇంకా అబ‌ద్ధాలేనా.. 

వైయ‌స్ఆర్  సంక్షేమ పాల‌న‌ను గుర్తుచేసేలా ఆయన‌క‌న్నా మ‌రో నాలుగ‌డుగులు ముందుకేసి వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ఐదేళ్లలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు. కోవిడ్ వంటి ప‌రిస్థితులు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా సంక్షేమ కార్యక్ర‌మాల‌ను ఆప‌లేదు. అన్ని విభాగాల్లోనూ నేష‌న‌ల్ యావ‌రేజ్ క‌న్నా ఉత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశారు. విజ‌న్ -2020 పేరుతో దారుణంగా ఫెయిలైన చంద్ర‌బాబు మ‌ళ్లీ విజ‌న్ డాక్యుమెంట్ 2047 పేరుతో 2047కి రూ.54 ల‌క్ష‌ల ప‌ర్ కేపిటా ఇన్‌కం సృష్టిస్తాన‌ని క‌ల్లబొల్లి మాట‌లు చెబుతున్నాడు. గ‌డిచిన ఏడాదిగా జీఎస్టీ వ‌సూళ్ల‌లో నెగిటివ్ గ్రోత్ న‌మోదు చేసిన చంద్ర‌బాబు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని త‌ప్పుడు లెక్క‌ల‌తో ఫేక్ ప్ర‌చారం చేసుకుంటున్నాడు. గ‌డిచిన వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా గ‌డ‌ప వ‌ద్ద‌కే సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌జేస్తే ఆ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ తీసుకొచ్చారు. దీనివ‌ల్ల హ‌డావుడే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందుతున్న ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అప్పుల‌పై ఇప్ప‌టికీ దుష్ప్ర‌చారం చేసి హామీలు అమ‌లు చేయ‌కుండా పబ్బం గ‌డుపుకుంటున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాల‌న‌లో చేసిన అప్పుల్లో 50 శాతానికి పైగా అప్పులు ఏడాదిలోనే చంద్ర‌బాబు చేశాడు. క‌నీసం కొత్త‌గా ఒక్క‌రికీ పింఛ‌న్  ఇవ్వ‌క‌పోగా దాదాపు 5 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ కోత పెట్టాడు. ఆఖ‌రుకి పింఛ‌న్ మీదే ఆధార‌ప‌డి బ‌తికే విక‌లాంగుల్ని సైతం వ‌ద‌ల‌కుండా పింఛ‌న్ తొల‌గించి వేధిస్తున్నారు. ఏ ఒక్క ప‌థ‌కం కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌కుండానే 15 నెల‌ల్లో దాదాపు రూ.2 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశారు. తెచ్చిన‌ ఆ డ‌బ్బుని ఏం చేసిన‌ట్టు?  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన అమ్మ ఒడి ప‌థ‌కానికి త‌ల్లికి వంద‌నంగా పేరు మార్చి అర‌కొర‌గా అమ‌లు చేసి గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంటున్నాడు. కూట‌మి పాల‌న‌లో వ్య‌వ‌సాయం రంగం భ్రష్టుప‌ట్టిపోయింది. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర దొర‌క‌డం లేదు. రైతుకు ఒక బ‌స్తా యూరియా కూడా అందించ‌లేని దౌర్భాగ్య స్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం ఉంది. 15 నెల‌ల్లోనే చంద్ర‌బాబు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశాడు. పోల‌వ‌రం ప్రాజెక్టును ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థకం చేస్తూనే ఉన్నాడు. 

ప్రైవేటుప‌రం చేయ‌డ‌మే విజ‌నా? 

పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రోడ్లు, మెడిక‌ల్ కాలేజీలు, టూరిజం.. ఇలా ఏ ఒక్క విభాగాన్ని వ‌ద‌ల‌కుండా అన్నింటినీ ప్రైవేటుప‌రం చేసేస్తున్నాడు. వైయ‌స్ జ‌గ‌న్ సంప‌ద సృష్టిస్తే చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి నాయ‌కులు ఆ సంప‌ద‌ను పంచుకుతింటున్నారు. విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ప‌ప్పు బెల్లాల మాదిరిగా త‌న వారికి క‌ట్టబెట్టేస్తున్నాడు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో కూడా  త‌ప్పుడు లెక్క‌ల‌తో గొప్ప‌లు చెప్పుకోవ‌డం, వైయ‌స్ఆర్‌సీపీ మీద బుర‌ద‌జ‌ల్ల‌డం త‌ప్ప చంద్ర‌బాబు ఒక్క నిజం మాట్లాడ‌టం లేదు. వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేసి చంద్ర‌బాబు చ‌రిత్ర‌హీనుడిగా నిలిచిపోయాడు. ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా నిర్వ‌ర్తించాల్సిన విద్య‌, వైద్య రంగాల‌ను చంద్ర‌బాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. నాణ్య‌మైన మ‌ద్యం ఇస్తాన‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన విజ‌న‌రీ చంద్ర‌బాబు. విజ‌న‌రీన‌ని మాటల్లో చెప్ప‌డం కాదు. ఆచ‌ర‌ణ‌లో విజ‌న‌రీగా చంద్ర‌బాబు నిరూపించుకోవాలి. భూమి విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాడు వైయ‌స్ జ‌గ‌న్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే, దానిమీద చంద్ర‌బాబు దుష్ప్ర‌చారం చేశాడు. అధికారంలోకి వ‌స్తానే ర‌ద్దు చేస్తాన‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కొన‌సాగిస్తున్నాడు. ప‌థ‌కం ప్ర‌కారం సంజీవ‌ని లాంటి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని లేకుండా చేస్తున్నాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తే త‌ట్టుకోలేక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు పెట్టి గొంతు నొక్కాల‌ని చూస్తున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఇలాంటి త‌ప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డ‌టం జ‌ర‌గ‌దు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే ఉండ‌దని చంద్ర‌బాబు తెలుసుకోవాలి.

Back to Top