కర్నూలు: ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఆదోనిలో వైయస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైయస్ఆర్‌సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెల్ఫీ దిగారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అయితే వైయస్ఆర్‌సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధు సూదన్, కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మంగళవారం ఆదోని మెడికల్ కాలేజీని సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చిరకాల కోరికను నెరవేర్చిన వైయస్ జగన్ కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం దశాబ్దాలుగా వైద్య సేవలకు దూరంగా ఉందని, అధిక జనాభా కలిగిన ఈ ప్రాంతంలోని నాలుగు, ఐదు నియోజకవర్గాల ప్రజలకు ఆదోని కేంద్ర బిందువుగా ఉంది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఏ నాడు కూడా ఈప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మించాలనే ఆలోచన రాలేదు. ఈ ప్రాంతం ప్రజలు చిన్నచిన్న జబ్బులకు కూడా కర్నూలు, బెంగళూరు లేదా హైదరాబాద్ వైపు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేయడం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీర్చినట్లు అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2021లోనే ఈ ప్రాజెక్టును ఆమోదించి, రూ. 475 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 430 పడకలతో కూడిన బోధనాస్పత్రి, ఆధునిక హాస్టల్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, సెంట్రల్ కిచెన్, లాండ్రీ, మోర్చరీ వంటి అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. ఇది కేవలం మెడికల్ కళాశాల మాత్రమే కాకుండా, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తి కొండ, మాన్వి, అలూరు, మడికేరి వరకు ప్రజలకు మెడికల్ హబ్‌గా మారబోతోంది. ఈ మెడికల్ కళాశాల పూర్తయితే ఆదోనికి శాశ్వత అభివృద్ధి ద్వారం తెరుచుకుంటుంది. వందల సంఖ్యలో డాక్టర్లు, వేలాది మంది నర్సులు, వందలాది విద్యార్థులు ఇక్కడ చేరతారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఆదోని రైల్వే, బస్సు సౌకర్యాలు మరింత విస్తరిస్తాయి. విద్య, ఆరోగ్య రంగాలలో ఆదోని మొత్తం రాయలసీమకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రైవేట్‌పరం చేసే కుట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సింది పోయి ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఆదోని మెడికల్ కళాశాలను పీపీపీ పేరిట చంద్రబాబు తన బినామీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం, ప్రభుత్వ కళాశాలలో కూడా ఎన్ఆర్ఐ కోటా ఫీజు భారీగా పెంచనున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సీటు ఫీజు రూ. 20 లక్షలుగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు అది ఏకంగా రూ.57.50 లక్షలకు పెంచుతున్నారు. ఇది ప్రైవేట్ కళాశాలల కంటే రూ. 17.9 లక్షలు ఎక్కువ. అంటే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్య అందనంత దూరమవుతుంది. ప్రభుత్వ భూములను ఎకరానికి కేవలం రూ.100కి బినామీలకు లీజు ఇవ్వడం, ఆసుపత్రుల్లో చికిత్స, మందులు, డయాగ్నోస్టిక్స్ అన్నింటిపై వసూళ్లు చేసే హక్కు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం కాకుండా వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తోంది. ఆదోని ప్రజలకు ఈ కళాశాల కేవలం ఒక విద్యాసంస్థ కాదు. ఇది వారి ఆరోగ్యానికి, వారి భవిష్యత్తుకు, వారి పిల్లల కలలకు ప్రతీక. ఇలాంటి ప్రజా ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే` అని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు బుట్టా ప్రత్యుల్, కర్నూలు 40 వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోడుమూరు నియోజకవర్గ ఆర్ టి ఐ విభాగం అధ్యక్షుడు విక్రమ్ సింహారెడ్డి, కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికల , కోడుమూరు నియోజకవర్గ మేధావులా విభాగం అధ్యక్షుడు రవీంద్రా రెడ్డి, పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.