ఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, ఓవైపు విశాఖపట్నం, అమరావతిలో ఇష్టారాజ్యంగా సాగుతున్న భూపందేరాలు, మరోవైపు డీఎస్సీ స్కాం, ఇంకోవైపు ఇసుక, మద్యం పేరుతో సాగుతున్న దోపిడీ ఇలా.. ఎటు చూసినా చంద్రబాబు రెండేళ్ల పాలన అక్రమాలమయంగా మారిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ చేస్తున్న అక్రమ భూకేటాయింపులు, డీఎస్సీ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ ఇవాళ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నట్లు పార్టీ ఎంపీలు పీవీ మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దిల గురుమూర్తితో కలిసి ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రెస్ మీట్లో వైవీ సుబ్బారెడ్డి ఇంకేమన్నారంటే... రాష్ట్రంలో పరాకాష్టకు భూపందేరం విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు సైతం ఎకరం భూమి రూ.99 పైసలకే కేటాయించే పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరమైన విశాఖలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల్ని కాపాడే సంస్థలకు ఇలా కేటాయిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక టీడీపీ ఎంపీకి చెందిన విద్యాసంస్థకు సుమారు 5 వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాలు ధారాదత్తం చేశారు. అమరావతి నిర్మాణంలోనూ ఇష్టారాజ్యంగా అనుయాయులకు భూకేటాయింపులు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఈ భూకేటాయింపులపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అలాగే డీఎస్సీ పరీక్షల నిర్వహణలోనూ నిబంధనలకు పాతరేసి అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంపైనా సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నాం. బియ్యం, ఇసుక, మద్యంలోనూ అక్రమాలే పీడీఎస్ కింద ఇచ్చే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడంపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించాం. అవినీతి లేకుండా మద్యం, ఇసుక విధానాలు అమలు చేశాం. ఇసుక సైతం స్టాల్స్ ద్వారా అమ్మకాలు చేయించాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉచిత ఇసుక పేరుతో లూటీ చేసే పరిస్ధితి ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కాంలు జరిగాయని చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలపై ఏసీబీ, సీఐడీ కేసులు పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్, ఇసుక, మైనింగ్, మద్యం కేసులు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని మూయించేస్తోంది. అలాగే డీఎస్సీ పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడింది. ఈ అంశాలన్నింటిపైనా సీబీఐ దర్యాప్తు జరగాలని ప్రధాని, హోంమంత్రి, సీబీఐ డెరెక్టర్ ను కోరబోతున్నాం. రాజధాని పేరుతో, భూముల కేటాయింపుల పేరుతో జరుగుతున్న అవినీతిపైనా లిఖితపూర్వకంగా సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం. ఆయా అంశాల మీద సీబీఐతో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్డితో కానీ విచారణ చేయించాలని కోరుతున్నాం. మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ వైవీ సుబ్బారెడ్డి విజయవాడ కృష్ణలంక తరహా ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. సాయికృష్ణ ఒక్కడే కాదు క్రాంతి కుమార్ అనే మరో యువకుడిని కూడా చంపేశారు. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన రెండు ప్రాణాలు తిరిగి వస్తాయా ? వైయస్ఆర్‌సీపీ తప్పకుండా బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్దంగా ఉంది. సాయికృష్ణను చంపేసి, మృతదేహాన్ని మాయం చేసేసి ఈ నెల 29న హైకోర్టుకు సమర్పిస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. సాయికృష్ణతో పాటు క్రాంతి కుమార్ ఘటనపైనా విచారణ జరిపించాలని కోరుతున్నాం.