ఢిల్లీ: రాజ్యసభ వేదికగా అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం అనే తప్పుడు సందేశం పంపించే కుట్ర జరిగిందని, సభలో తాను మాట్లాడుతుండగా టైం అయిపొయిందని 5 నిమిషాలకే మైకు కట్ చేయడంపై విచారణ జరిపించాలని పార్టీ ఎంపీలతో కలిసి ఆయన రాజ్యసభ చైర్మన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా 11 మంది సభ్యులున్న తమ పార్టీకి కనీసం 20 నిమిషాల సమయం వచ్చేదని, ఆ ప్రకారం తన స్పీచ్ ని రికార్డుల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా అమరావతికి భూములిచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాలకు సమాధానం చెప్పకుండా బిల్లును ప్రవేశపెట్టడంపైనే తాము వ్యతిరేకించామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - అమరావతికి వ్యతిరేకం అనే తప్పుడు సందేశం పంపించే కుట్ర అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. రాజధాని ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీకే వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం. బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నాం. అర్థవంతంగా లేని బిల్లుకే మేము వ్యతిరేకమని లోక్ సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా అదే చెబుతున్నాం. రాజ్యసభలో ఏపీ రాజధాని చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ గొంతు నొక్కే కుట్ర జరిగింది. రాజ్యసభలో ఏడుగురు, లోక్‌సభలో నలుగురు సభ్యుల బలమున్న వైయస్ఆర్‌సీపీకి కేవలం 5 నిమిషాల సమయమే కేటాయించి ఇద్దరు సభ్యులే ఉన్న టీడీపీకి మాత్రం ఒక్కొక్కరు పది నిమిషాల చొప్పున మాట్లాడే అవకాశం ఇచ్చారు. అమరావతి రాజధానికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకమనే తప్పుడు సందేశాన్ని ప్రజలకు పంపే విధంగా జరిగిన ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై రాజ్యసభ చైర్మన్ గారికి వివరించడం జరిగింది. ప్రతి బిల్లుపై చర్చ జరిగేటప్పుడు మాకు కనీసం 20 నిమిషాలు సమయం ఇస్తారు. నిన్న నేను మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెంటనే మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. కొందరి ప్రోద్భలంతోనే కావాలని చేశారని మాకు అనుమానాలున్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ గారికి వివరించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే సమయం ఇచ్చారు. అదే విధంగా రాజ్యసభలో ఇద్దరే సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఇద్దరూ 10 నిమిషాలు చొప్పున మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రజల దృష్టిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అమరావతికి వ్యతిరేకమని చిత్రీకరించే కుట్రకు రాజ్యసభను వాడుకున్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో నేను మాట్లాడాల్సిన బ్యాలెన్స్ స్పీచ్ కూడా రికార్డుల్లోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ స్పీచ్ కాపీని ఆయనకు అందజేయడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి అంతా టేబుల్ పై రికార్డు చేయించి అది రికార్డ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. - వైయస్ఆర్‌సీపీ ఎందుకు వ్యతిరేకం అంటే.. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఏడేళ్లయినా డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. అరకొరగా ఇచ్చినా, అవి గుంతల్లో, శ్మశానాల్లో ఉంటున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా రైతులు రోజూ సీఆర్డీఏ ఆఫీసు చుట్టూ తిరిగినా వారికి న్యాయం జరగడం లేదు. ఇటీవల ఒకరైతు తన ఆవేదన చెప్పుకుంటూ మంత్రి ముందే గుండెపోటుకి గురై చనిపోయాడు. అమరావతికి భూములిచ్చిన రైతులకు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఈ బిల్లులో పెట్టలేదు. దాని గురించి కొట్లాడుతున్నాం. అదేవిధంగా అమరావతి రాజధానికి ముంపు భయం ఉంది. చిన్నపాటి వర్షాలకే ఆ ప్రాంతం మునిగిపోతోంది. దానికి ఏ విధంగా పరిష్కారం చూపుతారో స్పష్టత ఇవ్వడం లేదు. దాన్ని కూడా బిల్లులో పొందు పరచాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. గత రెండేళ్లలో రూ. 47 వేల కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చదరపు అడుగు నిర్మాణం రూ. 4వేల నుంచి రూ.5 వేలకు పూర్తవుతుంటే, ఇక్కడ మాత్రం ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ. 12 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుందో తేలాలి. టెండర్లు పారదర్శకంగా జరగడం లేదు. ఈ అంశాలను కూడా బిల్లులో పొందుపరచాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఎంత ఏరియాలో రాజధాని నిర్మాణం చేయాలన్నది మరో ప్రధాన అంశం. భారతదేశంలో పెద్ద నగరం కలకత్తా 50 వేల ఎకరాల్లో ఉంది. దానికి సుమారు 200 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ - ఎన్సీఆర్ మొత్తం కలుపుకొంటే కూడా సుమారు 10 వేల ఎకరాల్లో ఉంది. అలాంటిది అమరావతిని లక్ష ఎకరాల్లో నిర్మించాలంటే ఆచరణ సాధ్యమేనా అని ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? మొదటి విడతలో భూములిచ్చిన రైతులకే ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్లీ రెండో విడత భూసమీకరణ అంటున్నారు. ఇటువంటి అంశాలపై చర్చ జరగాలి. కళ్లబొల్లి మాటలతో ప్రజలను మాయ చేసే కుట్ర జరుగుతోంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలి అన్నదే వైయస్ఆర్‌సీపీఉద్దేశం. లోక్ సభలో ఏ విధంగా మా పార్టీ గొంతు వినిపించామో అదేవిధంగా రాజ్యసభలో ఇంకా కూలంకషంగా చెప్పాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారు. ఈ అంశాలన్నీ కూడా రాజ్యసభ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. - గ్యాలరీని టెలీకాస్ట్ చేయొచ్చా? గ్యాలరీలో కూర్చున్న సభ్యుల ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇది వరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఉన్న ఎవరినీ సభ జరుగుతుండగా చూపించరు. కానీ గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎంపీలను చూపించారు. ఒక తెలుగు పేపర్ లో వారంతా కూర్చున్న ఫోటో బ్యానర్ ఐటమ్ గా పబ్లిష్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంపై కూడా విచారణ చేయాలని, అలా టెలీకాస్ట్ చేయడానికి నిబంధనలుంటే తెలియజేయాలని కోరడం జరిగింది. - అమరావతి వల్ల ఓడిపోయామనడం కరెక్టు కాదు అధికారంలో ఉన్న ఏడేళ్లలో చంద్రబాబు రాజధానిని సరిగ్గా మొదలు పెట్టనే లేదు. లక్ష ఎకరాల డెవలప్‌మెంట్‌కే రూ. 2 లక్షల కోట్లు కావాలంటున్నారు. అన్ని నిధులు వెచ్చించే స్థోమత రాష్ట్రానికి ఉందా అని ఎందుకు ఆలోచించడం లేదు? విశాఖ రాజధానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా లేదు కాబట్టి మరో ప్రత్యామ్నాయం సూచించాం. లక్షల కోట్లు వెచ్చించే కన్నా మావిగన్ ప్రపోజల్‌ను పరిశీలించాలని వైయస్ జగన్ గారు ప్రభుత్వానికి సూచించారు. కేవలం రూ. 5 వేల నుంచి రూ.10 వేల కోట్లతోనే సత్వర అభివృద్ది చేయొచ్చని చెప్పారు. మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందని చెబుతుంటే పరిశీలించకుండా ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలతో రాష్ట్రానికి రాజధానే లేకుండా చేస్తున్నారు. అమరావతి రాజధాని కారణంగానే వైయస్ఆర్‌సీపీ గత ఎన్నికల్లో ఓడిపోయిందనే ప్రచారం సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును రాజధానికి ముడిపెట్టడం సమంజసం కాదు. 2019 ఎన్నికల్లో అమరావతి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన లోకేష్ ఓడిపోలేదా. ● ఉన్నట్టుండి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? - గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎంపీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్‌లో రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఉన్నట్టుండి చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీ గురించి ప్రజల్లో అనుమానాలున్నాయి. భూములిచ్చిన రైతులకు ఒక్కరికీ కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లు పంపిణీ చేయలేదు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే చట్టబద్ధత అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఇందులో ప్రత్యేక హోదా అంశం ఎందుకు చేర్చలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. అసెంబ్లీ తీర్మాణం పేరిట వైయస్ జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కానీ మండలిలో వైయస్ఆర్‌సీపీ సభ్యులున్నారన్న భయంతో చర్చకు ముందుకు రాలేదు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా అమరావతి కోసం మిగతా ప్రాంతాలపై వివక్ష చూపుతున్నారు.