తాడేపల్లి : అణుశక్తి సైంటిస్టులకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతం కావడంపై వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు IGCAR((Indira Gandhi Centre for Atomic Research), BNHAVINI( (భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్) అణుశక్తి విభాగంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్ తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది. మన అపారమైన థోరియం నిల్వలను ఇంధన స్వావలంబనకు వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.