తిరుపతి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ “ఖబడ్దార్ రాధాకృష్ణ” అంటూ నినాదాలతో నగరం దద్దరిల్లింది. వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్కే రోజా, శైలజానాథ్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్, మోహిత్, విజయానంద రెడ్డి, నూకతోటి రాజేష్ హాజరయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధు, వెంకట్ గౌడ్, జడ్పీ చైర్మన్ వాసు, మాజీ మేయర్ శిరీషా, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, జిల్లా ఇంచార్జ్ చవ్వ రాజశేఖర్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.