వెలిగొండకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నీళ్లు ఇవ్వాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి డిమాండ్‌

తిరుపతి: వెలిగొండ ప్రాజెక్టు నుంచి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నీళ్లు ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఎంపీ, తమ హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ పనులను పూర్తిచేసి ప్రారంభించామని చెప్పారు. రెగ్యులేటర్‌కు సంబంధించిన కొంత పని మిగిలి ఉండటంతో పాటు వేసవి కాలం కావడంతో అప్పట్లో నీటిని విడుదల చేయలేకపోయామని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

  తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలపై రాజకీయ వ్యాఖ్యలు తగవని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న అధికారులపై, నాయకులపై భవిష్యత్తులో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నాలు సహించబోమని అన్నారు. జిల్లాల విభజన అంశంపై మాట్లాడుతూ, జిల్లాల విభజనను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే చేపట్టిందని గుర్తు చేశారు.  
 

Back to Top