బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి
 

న్యూ ఢిల్లీ: ఏపీలో కూటమి నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నార‌ని, బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో తాను పనిచేస్తానని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రమాణం చేసేందుకు ఎంపీ మిథున్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ వద్ద మిథున్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. హ్యాట్రిక్‌ విజయాలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో పని చేస్తానని చెప్పారు.

జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం. బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు. కూటమి నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతానని ప్రచారం చేశారు. వైయ‌స్‌ జగన్‌ నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు. వైయ‌స్ఆర్‌సీపీకి పూర్వవైభవం సాధించే వరకు కష్టపడతాను. రాజంపేటలో అత్యధిక రోడ్డు వేయించిన ఘనత మాదే అంటూ మిథున్‌రెడ్డి కామెంట్స్‌ చేశారు. 

Back to Top