కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కల్యాణ్ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైయస్ఆర్ సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కల్యాణ్’ అంటూ కౌంటరిచ్చారు. ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్‌లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్ ఛేంజర్. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు.