డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కూటమి అభ్యర్థులు మీ ఇంటికి వచ్చినప్పుడు వైయస్ జగన్ ఎందుకు ఓడించాలి ప్రశ్నించాలని ఆయన ప్రజలను కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్నందుకా, గతంలో ఎవరు ఇవ్వలేని విధంగా అవినీతికి త్రోవ లేకుండా సంక్షేమ పథకాలు అందించినందుకా అని ప్రశ్నించాలన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచన చేసి ఓటెయ్యాలన్నారు. కేజీ బంగారం ఇస్తానని చెబితే తీసుకోండి కానీ మీ ఇంటిలో మంచి జరిగితే ఫ్యాన్‌కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్.జగన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే..: పి.గన్నవరం సిద్ధమా.. ఇంతటి మండుటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం, ప్రేమానురాగాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ,చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ,తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మిట్టమధ్యాహ్నం సమయం 1.30 గంటలు కానీ ఇక్కడ చూస్తున్న మీ ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తే మీ బిడ్డకు ఎప్పుడూ రుణపడి ఉంటాడు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య ఎన్నికలు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య అని గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబ భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలకా అంటూ మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీఇంటి తలుపులు కొడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఏ వాగ్ధానాన్ని నిలబెట్టుకోకపోవడమే చంద్రబాబు నైజం. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను.. బాబును నమ్మడం అంటే విషసర్పాన్ని నమ్మడమే అన్న సంగతి మీ అందరూ గుర్తించుకోమని కోరుతున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటీ చేయకపోవడం, తాను మొదటి సంతకాలుగా పెట్టిన ఏ వాగ్ధానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజం. మరోపక్క చెప్పిన ప్రతి మాటను, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిమాటను కూడా ఏకంగా 99 శాతం అమలు చేసి ప్రతి పేదవాడికి మంచిచేయాలని తపన, తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం. తేడా గమనించమని మీ అందరినీ కోరుతున్నాను. ఇంటింటి అభివృద్ధికి కొనసాగింపు మన 2024 మేనిఫెస్టో... మనందరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024లో మనం ఇచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ మరో రెండు అడుగులు ముందుకేస్తూ ఇంటింటి అభివృద్ధి, ఇంటికే పౌరసేవలు, ఇంటికే పథకాలు ఇవన్నీ కొనసాగింపు... 2024కు సంబంధించిన మన మేనిఫెస్టో. మీరంతా చూస్తున్నారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపున నిలబడి ఉన్నాడు. మీ అందరికీ ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, మోసాలు, వీరికి తోడు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్.. వీరంతా కూడా జగన్ ను ఓడించాలని చూస్తున్నారు. మరి మీ జగన్ పేదలను గెలిపించాలని, ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయ పడుతున్నాడు. మాట తప్పనందుకా మీ జగన్ ను ఓడించాలి? ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నాను. ప్రతి అన్నను అడుగుతున్నాను. ప్రతి అక్కను అడుగుతున్నాను. ప్రతి చెల్లెమ్మను అడుగుతున్నాను. ప్రతి తమ్ముడిని అడుగుతున్నాను. మీరే చెప్పండి జగన్ ను ఎందుకు ఓడించాలని చెప్పి మిమ్మల్నే అడుగుతున్నాను. జగన్ ను ఎందుకు ఓడించాలి? పేదలకు ఇంటింటికీ మంచి చేసినందుకు ఓడించాలా? అని అడుగుతున్నాను. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా జగన్ ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబును, ఇదే కూటమిని వీళ్లందరినీ కూడా గట్టిగా అడుగుతున్నాను మరి జగన్ ను ఎందుకు ఓడించాలి?. ఇదే చంద్రబాబు, ఇదే రామోజీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే దత్తపుత్రుడు, ఇదే జన్మభూమి కమిటీల దోపిడీముఠాకు అధికారం రావడం కోసమా జగన్ ను ఓడించాలి? వీరందరూ కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా దోచుకుని వాళ్లందరూ పంచుకోవడం కోసమా జగన్‌ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో పేదలకు చేయని మేలు ఏపీలో చేశాం. 77 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికీ చేసిన మంచి కంటే.. కేవలం ఈ 5 సంవత్సరాలల్లో మీ బిడ్డ వీళ్లందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుకా జగన్‌ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ఏకంగా రూ.2.70 వేల కోట్లు డీబీటీగా మీ బిడ్డ ఏకంగా 130 బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అందజేసినందుకా వీరంతా కూడా జగన్‌ను ఓడించాలి? అని అంటున్నారు. ఎందుకు జగన్‌ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ఈ పథకాలేవీ చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదని, ప్రజలకు అన్యాయం జరగాలి అనేందుకా జగన్‌ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ఈ పథకాలన్నీ రద్దు చేయాలనా జగన్‌ను ఓడించాలి? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి అన్నను, ఇక్కడ ఉన్న తమ్ముడిని, ఇక్కడ ఉన్న అక్కను, ఇక్కడ ఉన్న అవ్వను, ఇక్కడ ఉన్న ప్రతి తాతను, ఇక్కడ ఉన్న చెల్లెమ్మను అడుగుతున్నాను. ఎందుకు జగన్‌ను ఓడించాలి?. జగన్‌ను ఓడించాలా లేదా జగన్‌ను గెలిపించాలా? అన్నది మిమ్మల్నే అడుగుతున్నాను. గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో కేవలం తాను 32 వేల గవర్నమెంట్ ఉద్యోగాలిస్తే మీ బిడ్డ ఈ 58 నెలలకాలంలో ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకా? జగన్‌ను ఓడించాలి అని అడుగుతున్నాను. ప్రతి పేద కుటుంబం ఎదగాలని, ప్రతి పేద కుటుంబం ఎదిగేలా బాబు ఏ స్కీమ్ కూడా గతంలో పెట్టనందుకా? బాబు కోసమా జగన్‌ను ఓడించాలి అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరోవైపు గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుకా? జగన్‌ను ఓడించాలి అని అడుగుతున్నాను. జగన్‌ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు? అని అడుగుతున్నాను. గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా మీ జగన్ ఈ 58 నెలలకాలంలోనే ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు అందులో నా అవ్వాతాతలకు ప్రతిఒక్కరికీ కూడా రూ.3వేల పెన్షన్ ను ఇంటికే పంపించినందుకా? ఎండలోనూ వానలోనూ చలిలోనూ కూడా ఆ పేదలు ఒకటో తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు పెన్షన్ అందించినందుకా? జగన్‌ను ఓడించాలా అని అడుగుతున్నా. ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ ను ఇంటింటికీ వెళ్లి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుకా జగన్‌ను ఓడించాలి అని చెప్పి వీళ్లంతా అనుకుంటున్నారు? అని అడుగుతున్నాను. గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఆ రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి పెట్టుబడికి సహాయంగా రైతుభరోసాను అందించినందుకా? జగన్‌ను ఓడించాలా అని వీళ్లందరూ అడుగుతున్నారు అని అడుగుతున్నాను. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ఎప్పుడూ చేయనివిధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుకా జగన్‌ను ఓడించాలా అని వీళ్లందరూ అడుగుతున్నారు అని అంటున్నాను. ఎప్పుడూ ఎవరూ చేయనివిధంగా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా 22 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తూ.. ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుకా జగన్‌ను ఓడించాలి అని వీళ్లంతా తాపత్రయ పడుతున్నారు అని అడుగుతున్నాను. 77 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చంద్రబాబునాయుడు గానీ ఏ ఒక్కరూ గానీ చేయనివిధంగా ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని అడుగులు వేసినందుకా మీ బిడ్డను, మీ జగన్‌ను ఓడించాలి అని వీళ్లంతా అడుగుతున్నారు అని అడుగుతున్నాను. జగన్‌ను ఎందుకు ఓడించాలి? బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్నే అడుగుతున్నాను. ప్రతి అన్నను అడుగుతున్నాను, ప్రతి అన్నను అడుగుతున్నాను, ప్రతి అక్కను అడుగుతున్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతున్నాను, ప్రతి అవ్వాతాతను అడుగుతున్నాను మీరే చెప్పండి బాబుకు ఎందుకు ఓటు వేయాలి? అని. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా? అని అడుగుతున్నాను. ఇది అందరికీ గుర్తుందా? మీ అందరికీ గుర్తుందా?(టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ..) ఇది 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో కనిపిస్తున్నారా ఒకవైపున చంద్రబాబు, పక్కనే దత్తపుత్రుడి ఫొటో, ఆ పక్కనే వీళ్లు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. వీళ్ల ముగ్గురి ఫొటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ప్రతి ఇంటికీ పంపించాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు పంపించిన ఫాంప్లెట్ లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారి ఈటీవీలోనూ, ఏబీఎన్‌లోనూ, టీవీ5లోనూ అడ్వర్టైజ్ మెంట్లు కూడా ఊదరగొట్టారు గుర్తుందా అన్నా, గుర్తున్నాయా చెల్లి, అక్కా గుర్తున్నాయా. అప్పట్లో గుర్తుందా? ఒక తల్లీ ఒక చెల్లీ మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చేయి తీసుకుంటా ఉంటుంది వెంటనే ఇంకొక చేయి అడ్డుకుంటుంది. అడ్డుకుని ఏమంటుంది? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అని అంటుంది. బాబు వస్తున్నాడు అని అంటుంది గుర్తున్నాయా? ఈ 2014లో వీళ్ల ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో పంపించిన ఈ అంశాలను, హామీలను ఒక్కసారి చదవమంటారా? నేను చదువుతాను. మీరే చెప్పండి చేశాడా? లేదా? అని అడుగుతున్నాను. చంద్రబాబు విఫల హామీలు. రైతు రుణమాఫీ రూ.87,612 కోట్లు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు. జరిగిందా? ముఖ్యమైన హామీలు అని ఇచ్చిన రెండో హామీ రూ.14,205 కోట్ల రూపాయిలు పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు చంద్రబాబు. డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఆడబిడ్డ పుడితే మహలక్ష్మీ పథకం కింద రూ.25,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. ఒక్క రూపాయి అయినా వేసాడా.? మరో హామీ ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా రెండువేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇల్లు అన్నాడు. మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? పదివేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తా అన్నాడు. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తా అన్నాడు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ కడతా అన్నాడు, పి.గన్నవరంలో కానీ అమలాపురంలో కానీ హైటెక్ సిటీ కనబడుతోందా? చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి, ముగ్గురి ఫొటోలతో జతకట్టి మీ ఇంటింటికీ పంపిన పాంప్లెట్‌లో చెప్పిన హామీల్లో ఒక్కటైనా అమలు అయ్యిందా? ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? ఇప్పుడు ఇదే ముగ్గురు ఏమంటున్నారంటే, ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తారట..నమ్ముతారా? పేదల భవిష్యత్ మారాలంటే ఫ్యానుకే రెండు ఓట్లేయండి. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా.. పేదవారి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, మన బడులు, చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయము, హాస్పిటల్స్ మెరుగుపడాలన్నా.. ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా..! మన గుర్తు ఫ్యాన్. అక్కడో ఇక్కడో తెలియకపోయినా...చెబుతున్నా..మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు అందించండి. ఇదే కోనసీమలో మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే ఏవైనా కారణాల వల్ల ఓటు వేయని వారుంటే...కులంపరంగా లేదా వాళ్ల పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు..వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు వేసే ఈ ఓటు వల్ల రాబోయే తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటికీ అందుతున్న పథకాలు, అభివృద్ధి నిర్ణయమవుతుంది. ఇంటికి వెళ్లండి, ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న భార్యతో, అవ్వా తాతలతో కలిసి ఆలోచన చేయండి. పిల్లలకు ఓటు లేదని వారిని పక్కన పెట్టొద్దు వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకుని ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది అని, ఎవరు ఉంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది అని ఆలోచించండి. అప్పుడే నిర్ణయం తీసుకుని ఓటు వేయండి. ఎప్పుడైనా మీరు సినిమాకు వెళతారు. ఆ సినిమాలో హీరో ఎవరో, విలన్ ఎవరో మీకుతెలియదు. కానీ మీ అందరికీ హీరో ఎందుకు నచ్చుతాడు? హీరో మంచి చేస్తాడు కాబట్టి మీ అందరికీ నచ్చుతాడు. హీరోలో మానవత్వం ఉంది కాబట్టి నచ్చుతాడు. విలన్ ఎందుకు నచ్చడు? కారణం విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి..అబద్ధాలు చెబుతాడు కాబట్టి, కుట్రలు చేస్తాడు కాబట్టి మీకు విలన్ నచ్చడు. నిజజీవితంలో కూడా ఆలోచన చేయండి ఎవరు హీరో? ఎవరు విలన్? అని ఆలోచించండి. ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయండి. మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.