అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని ఉరవకొండ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతోనే దిగజారి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యక్తిగత వినాశనాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా సభలో.. `జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది' అంటూ చంద్రబాబు బరితెగించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైయస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పట్టణంలో 5, 6 వార్డుల్లో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓటును అభ్యర్తించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ..వైయస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో పేదరికం లేకుండా పోతుందని తెలిపారు. ఆయన తెచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ ఐదేళ్ళ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని వైయస్ జగన్ ప్రజలను అడుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల్లో వైయస్ జగన్ ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రోజురోజుకు జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి వీళ్ళు ఈర్ష్య పడుతున్నారన్నారు. అందుకే ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా వైయస్ జగన్ కే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించారని వెల్లడించారు. తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.