పక్కా ప్లాన్‌ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి 

కాపు కుల ప్ర‌స్తావ‌న‌తో బండబూతులు తిడుతూ దాడి చేశారు

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్ర‌హం

గుంటూరు: తమపై పక్కా ప్లాన్‌ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆరోపించారు. కాపు కుల ప్ర‌స్తావ‌న తెస్తూ ల‌కారాలు జోడించి తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సోమ‌వారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా?. కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేశారు. బండబూతులు తిడుతూ లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్‌గా చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా వైయ‌స్‌ జగన్‌ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారు. ఎ‍మ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి?. తాగుబోతులను మాపై ఉసిగొల్పారు. 

మా నాన్నకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అలా మట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు. టీడీపీ గూండాలను కంట్రోల్‌ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్‌ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరమైనపై భాషతో కారుపై దాడి చేశారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు. దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు. హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. మేము వైఎస్సార్‌సీపీ అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.

గల్లా మాధవికి కుటుంబం ఉంది. మీకు కుటుంబం ఉంది కదా?. కొంతమంది మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ అత్మ సాక్షికే వదిలేస్తున్నాను. రాంబాబు దేని గురించి భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబు గారిని స్టేషన్‌లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్‌.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమా?. దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్‌తోనే మాపై దాడి చేశారు అని చెప్పుకొచ్చారు. 

Back to Top