దెందులూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలోపేతం కావాలని దెందులూరు మాజీ శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదపాడు మండలం అప్పన వీడు గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ, అనుబంధ విభాగాల కమిటీ సభ్యుల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది గ్రామ పార్టీ అధ్యక్షులకు పార్టీ కండువాలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, పార్టీకి గ్రామ కమిటీలు వెన్నెముకల వంటివని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం బలంగా ఉండేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కొత్తగా నియమితులైన గ్రామ పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ నాయకులు, గ్రామ అబ్జర్వర్లు, నూతనంగా ఎంపికైన గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు.