టార్గెట్ అంబ‌టి రాంబాబు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టిపై కూట‌మి ప్ర‌భుత్వం కక్ష సాధింపు..

52 కేసులు, పిటీ వారెంట్లు   

 గుంటూరు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న అంబటిని రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా వరుసగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రజల కోసం పోరాడినందుకే కేసులా?

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 12న అంబటి రాంబాబు ప్రజాస్వామ్య పద్ధతిలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదనే ఆందోళనతో ఈ నిరసన చేపట్టారు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నిర్వహించిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. ఈ ఘటనలో విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే.

52 కేసులు... రాజకీయ వేధింపులే
రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై ఇప్పటికే 52 కేసులు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను కోర్టుల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనం. తాజాగా మరో కేసులో భాగంగా పిటీ వారెంట్ జారీ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరచడం కూడా అదే కుట్రలో భాగమే.

జైలులో కనీస సదుపాయాలు క‌రువు
రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి రాంబాబుకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడికి ప్రత్యేక భద్రత కల్పించకుండా ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం అనుమానాస్పదమని అడ్వకేట్లు పేర్కొంటున్నారు. అంబటి ఆరోగ్యం విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రజల గొంతుకను అణచివేతే లక్ష్యం
ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న అంబటి రాంబాబును మానసికంగా, భౌతికంగా వేధించడమే కూటమి లక్ష్యమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

వెనక్కి తగ్గేది లేదని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం
ప్రజల కోసం పోరాడే నేతలను కేసులతో భయపెట్టలేరని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. అంబటి రాంబాబు పై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ పోరాటం కొనసాగుతుందని నేతలు తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు అన్ని స్థాయిల్లో పోరాడతామని హెచ్చరించారు. అంబటి రాంబాబుపై కొనసాగుతున్న చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, ఇది కూటమి ప్రభుత్వ రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

Back to Top