అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి వైయస్ఆర్‌సీపీ నేతల్ని ఎలా కేసుల్లో ఇరికించి లోపల వేద్దామన్న ధ్యాస తప్ప రాష్ట్రానికి ఏం చేద్దాం అన్న ఆలోచన లేకుండా పోతోందని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మండిపడ్డారు. ఓవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులు విదల్చలేదని, అయినా కూటమి ఎంపీలు ప్రశ్నించలేని పరిస్ధితుల్లో ఉన్నారని అన్నారు. వీటి నుంచి జనం దృష్టి మళ్లించేందుకే వైయస్ఆర్‌సీపీ నేతలపై, వారి ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని శైలజానాథ్ తెలిపారు. ఇప్పటికైనా వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడుల్ని అడ్డుకుని, రాష్ట్రానికి ఎలా మేలు చేయాలో ఆలోచించాలని శైలజానాథ్ సూచించారు. ప్రెస్ మీట్ లో శైలజానాథ్ ఇంకేమన్నారంటే.. బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం: ప్రజల బతుకులతో కేంద్రం ఆటలాడుతోంది. బడ్జెట్ లో రైతులు వాడే ఆముదం చెక్క, అమ్మోనియో ఫాస్పేట్, నైట్రోజన్ ఫాస్పేట్ ధరలు పెంచారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడేలా చేయాలనేది దీని ఉద్దేశమా ? మల్టీ బిలియనర్లు చేసే వ్యాపారానికి రేట్లు తగ్గుతాయి, రైతులు వ్యవసాయానికి అవసరమయ్యే ఎరువుల ముడిపదార్థాల రేట్లు పెరుగుతాయి. వ్యవసాయ బడ్జెట్ లో దాదాపు ఎరువుల సబ్సిడీకే 16 వేల కోట్ల కత్తెర వేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా?, అలాగే రైతులకు కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదు. ఫసల్ బీమాకు డబ్బులు పెరగాల్సింది పోయి రూ.14,473 నుంచి రూ.12,200కు తగ్గించేశారు. కోకో, జీడిపప్పు వంటి హైవ్యాల్యూ ఉత్పత్తుల పరిశోధనలకు మాత్రమే నిధులిచ్చారు. ఎగుమతులకు రూ.350 కోట్లు, నమో డ్రోన్లకు రూ.676 కోట్లు ఇచ్చి, సాధారణ రైతుల్ని మాత్రం విస్మరించారు. ఉపాధి హామీ పథకంలో రూ.58 వేల కోట్లు కోత విధించారు. గతంలో దివంగత రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం హక్కుగా వచ్చింది. దీని వల్లే కరోనా టైంలో తల్లీ బిడ్డా బతికారు. చంద్రబాబు డబ్బాలు కొట్టుకున్న అమరావతి రైలుకు సైతం మొండిచేయే చూపారు. విశాఖ రైల్వే జోన్ గురించి బడ్జెట్లో అస్సలు ప్రస్తావనే లేదు. ప్రశ్నించలేని స్ధితిలో చంద్రబాబు: చంద్రబాబును రాష్ట్రం గురించి ఆలోచించమని అడగడం కూడా అత్యాశే. అయినా ఆలోచించమని కోరుతున్నాం. మీకున్న గంపెడు ఎంపీల్ని తీసుకెళ్లి బడ్జెట్ లో న్యాయం చేయమని కేంద్రాన్ని అడగండి. ఏపీ విభజన చట్టంలో హామీలు అమలు చేయమని అడగండి. ఏ ఇజమూ లేదు టూరిజమే ఉందని చెప్పే చంద్రబాబు.. దానికి నిధులు వచ్చాయని జబ్బలు చరుచుకుంటున్నారు. బడ్జెట్ లో అమరావతి రైలు ఏమైంది ?, 2024లో దీన్ని ప్రకటించారు. ఆ తర్వాత మెట్రో కూడా అన్నారు. అమరావతి మెట్రోపాలిటన్ సిటీ అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పథకం పెట్టి రైతుల భూములు లాక్కున్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతితో బృహత్ నగరం చేస్తామంటున్న చంద్రబాబు.. రాజధానిలో నీళ్లు తోడే కార్యక్రమం ముందు ఆపాలి. ఎక్కడైనా నదుల నుంచి పొలాల్లోకి నీళ్లు తోడతారు, కానీ అమరావతిలో మాత్రం ఊర్లో నుంచి ఏట్లోకి నీళ్లు తోడే కార్యక్రమం చేస్తున్నారు. గుంటూరు, విజయవాడను కలుపుతామంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఢిల్లీకి నెలకోసారి వెళ్లే చంద్రబాబు ఏం సాధించారో ఈ బడ్జెట్ తేల్చేసింది. డైవర్షన్ కోసమే వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు: బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా కూటమి ఎంపీలు ప్రశ్నించలేని అచేతన స్ధితిలో ఉన్నారు. గతంలో ఉపాధి హామీ బిల్లు పేరును జీ రాంజీ అంటూ మార్చినప్పుడు, నిధుల్ని ఇవ్వకుండా రాష్ట్రాలపై రుద్దినప్పుడు పార్లమెంట్‌లో మా ఎంపీలు ప్రశ్నించారు. కానీ ఇవాళ బడ్జెట్లో ఆ పథకానికి కూడా నిధులు కోత పెట్టినా టీడీపీ ఎంపీలు నోరెత్తడం లేదు. కనీసం ప్రశ్నించడం లేదు. నిజానికి మీకు ఇవేం పట్టవు. అధికారం ఎలా కాపాడుకోవాలి, పోలీసు వ్యవస్థను ఎలా ధ్వంసం చేయాలి, ప్రజల్ని ఎలా భయబ్రాంతుల్ని చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. దాని వల్ల రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం ఏమిటన్నది అందరికీ అర్ధమవుతోంది. అందుకే వాటన్నింటిని కప్పి పుచ్చడానికి వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని సాకే శైలజానాథ్ ఆక్షేపించారు.